ఆదిలాబాద్లో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలుచోట్ల వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. పట్టణంలోని బంగారు గూడ వాగు ఉప్పొంగడంతో శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు రాత్రి మోడల్ స్కూల్లోనే చిక్కుకుపోయారు. వాగు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వాగు దాటి వెళ్లే విద్యార్థులు ఇంటికి వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో అధికారులే చొరవ తీసుకుని వారికి మోడల్ స్కూల్లోనే వసతి సౌకర్యం కల్పించారు. అయితే, విద్యార్థులు ఇంటికి రాకపోగా వారు కనీసం ఇంటికి చేరుకునే మార్గం కూడా లేకపోవడంతో వారి భద్రత గురించి ఆందోళన చెందడం తల్లిదండ్రుల వంతయ్యింది.
అయితే, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలుసుకున్న అధికారులు.. మరింత మెరుగైన సౌకర్యం కోసం అర్ధరాత్రే జైనథ్ మీదుగా విద్యార్థులను జిల్లా కేంద్రానికి తరలించారు. విద్యార్థులు క్షేమంగా సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారని తెలిశాకే.. వారి తల్లిదండ్రులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.