Tirumala Water Scarcity: తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన సూచన చేసింది. కొండపై నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించింది. తిరుమలలో నీటి నిల్వ మూడు నెలలకు సరిపడా మాత్రమే ఉందని ప్రకటించింది. నీటి నిల్వ అరకొరగా ఉండడంతో భక్తులందరూ నీటిని పొదుపుగా వాడాలని సూచనలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్ల తర్వాత మళ్లీ తిరుమలలో నీటి సంక్షోభం వచ్చిందని భక్తులు చెబుతున్నారు.
Also Read: Tirupati Laddu: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. మరింత రుచి, నాణ్యతగా తిరుపతి లడ్డూ
తిరుమలలో భక్తులు, స్థానికులు నీటిని పొదుపుగా వినియోగించాలని బుధవారం టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ప్రకటన విడుదల చేశారు. తిరుమలలో నెలకొన్న నీటి కొరతను వివరించారు. తిరుమలలో ప్రస్తుతం నీరు 130 రోజులకు మాత్రమే ఉందని తెలిపారు. తక్కువ వర్షపాతం నమోదు కావడంతో తిరుమలలోని ఐదు డ్యామ్‌లలో నీటి కొరత ఉందని వివరించారు. తిరుమలలోని ప్రధాన డ్యామ్‌లలో నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుందని టీటీడీ వెల్లడించింది. తిరుమలలోని స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి సాధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నామని టీటీడీ తెలిపింది.
Also Read: Raksha Bandhan 2024: వైఎస్ జగన్‌కు రాఖీ కట్టని షర్మిల.. అన్నాచెల్లెళ్ల మధ్య పెరుగుతున్న దూరం
నీటి వినియోగం
తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం ఉంటుంది. వీటిలో 18 లక్షల గ్యాలన్లు తిరుమల డ్యామ్‌ల నుంచి.. మిగిలిన నీరు తిరుపతిలోని కల్యాణి డ్యామ్ నుంచి సరఫరా అవుతున్నాయి. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు. ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
బ్రహ్మోత్సవాలకు అప్రమత్తం
అక్టోబర్ 4 నుంచి 12 వ తేదీ వరకు తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమలను పెద్ద ఎత్తున భక్తులు సందర్శించనున్న నేపథ్యంలో ముందే టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటి నుంచే నీటి వృథాను అరికట్టి నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సందర్భంగా భక్తులు, స్థానికులకు నీటిని పొదుపుగా వాడాలని సూచించింది.
తక్కువ వర్షాపాతం
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. కానీ తిరుమలలో ఆశించిన వర్షాలు పడలేదు. కొండపై అతి తక్కువ వర్షాపాతం నమోదు కావడంతోనే ఈ సమస్య ఎదురైందని తెలుస్తోంది. సాధారణంగా కొండపై ఉన్న డ్యామ్‌లతోనే తిరుమల అవసరాలు తీరుతాయి. కానీ గతేడాది అల్ప వర్షాపాతం నమోదైనా ప్రాజెక్టులు నిండుకున్నాయి. కానీ ఎండలు తీవ్రరూపం దాల్చడంతో నీటి నిల్వ తగ్గిపోయింది. ఈ వర్షాకాలంలో వర్షాలు గతం కన్నా తక్కువ కురవడంతో ఇప్పటివరకు డ్యామ్‌లలో వరద చేరలేదు. ఈ నేపథ్యంలోనే నీటి కొరత ఏర్పడింది. భవిష్యత్‌లో వర్షాలు కురిసి సమస్య పరిష్కారమవుతుందని టీటీడీ భావిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter