కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఆదివారం చివరి విడత పోలింగ్లో 9 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగ్గా అందులో 8 లోక్ సభ స్థానాల్లో రీపోలింగ్ జరగాల్సిన అవసరం ఉందని బీజేపి డిమాండ్ చేసింది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో హింసను ప్రేరేపించిన టీఎంసి.. పలు కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకుందని బీజేపి అగ్ర నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డైమండ్ హార్బర్, కోల్కతా నార్త్, కోల్కతా సౌత్, జాదవ్పూర్, బసిర్హట్, మధురాపూర్, జాయ్నగర్ లోక్ సభ స్థానాల పరిధిలో హింస పెచ్చుమీరిందని, టీఎంసి గూండాలు ఎన్నికలను అడ్డుకున్నారని బీజేపి అగ్రనేత ముకుల్ రాయ్ ఆరోపించారు. అందుకే ఆయా లోక్ సభ స్థానాల పరిధిలోని పలు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ముకుల్ రాయ్ పేర్కొన్నారు. ఓటమి భయంతోనే టీఎంసి ఈ రకంగా దాడులకు పాల్పడుతోందని, కేంద్ర బలగాలపై ఆ పార్టీ చేస్తోన్న ఆరోపణలు చూస్తే టీఎంసి నేతల మానసిక పరిస్థితి బాగోలేదని అర్థమవుతోందని బీజేపి నేతలు ఎద్దేవా చేశారు.
ఆదివారం పశ్చిమ బెంగాల్లో జరిగిన 7వ విడత పోలింగ్లో మొత్తం 1.49 కోట్ల మంది ఓటర్లలో సాయంత్రం 5 గంటల వరకు అందిన గణాంకాల ప్రకారం 72 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.