Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీకి నైజాం ఏరియాలోనే మంచి మార్కెట్ ఉంది. ఇక్కడే ఎక్కువ మంది అభిమానులున్నారు. ఇక ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి జనసేనాని కొండగట్టుకు వచ్చినపుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. జనసేన ఆవిర్భావ కొత్తలో తెలంగాణలో కూడా చాలా యాక్టివ్ గా పార్టీ ఉంది. వేలాది మంది పవన్ అభిమానులు పార్టీలో సభ్యత్వం తీసుకొని జనసేన కోసం పని చేశారు. తర్వాత తెలంగాణలో ఏర్పడ్డ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీ పూర్తిగా స్తబ్దుగా మారింది. బీజేపీతో పొత్తులో ఉన్నా తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన జనసేనాని ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా జనసేన మారింది. వైసీపీనీ చిత్తు చిత్తుగా ఓడించడంలో జనసేనదే కీలక పాత్ర అని అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికల్లో లోక్ జనశక్తితో పాటు వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాలో భారీ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ జనసేన సత్తా ఏంటో తెలుగు రాష్ట్రాలకు చాటేలా చేశారు. తాను ఏళ్లుగా అనుకుంటున్న లక్ష్యానికి మొన్నటి ఎన్నికల్లో సాధించాననన్న ఆనందం జనసేనానిలో కనపడింది. ఈ రోజున ఏపీలో కూటమి అధికారంలో ఉందంటే పవన్ కళ్యాణ్ కారణమని సీఎం చంద్రబాబే ఒప్పుకున్నారంటే పవన్ ఎంతలా ప్రభావం చూపాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అయితే ఏపీలో విజయం తర్వాత తన ఆరాధ్య దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కోసమని తెలంగాణలో పర్యటించి తన సత్తా చూపించే ప్రయత్నం చేసాడు జనసేనాని. హైదరాబాద్ నుంచి మొదలు కొండగట్టు వరకు పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. ఎక్కడ చూసినా వందలాది మంది పవన్ అభిమానులు డిప్యూటీ సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ కు ఇక్కడ వస్తున్న స్పందన చూస్తుంటే భవిష్యత్తులో తెలంగాణలో కూడా జనసేన పూర్తిగా యాక్టివ్ అవ్వబోతుందేమో అన్న సంకేతాలు క్యాడర్ కు ,అభిమానులకు ఇచ్చారా అన్న సందేహం రాజకీయవర్గాల్లో చర్చ జరగింది. మొన్నటి వరకు నానా మాత్రంగా జనసేన కమిటీలు తిరిగి యాక్టివ్ అవుతాయా అన్న చర్చకు తెరలేసింది.
ఏపీలో విజయం తర్వాత తెలంగాణలో కూడా పార్టీనీ తిరిగి బలోపేతం చేయాలని జనసైనికుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందంట. ఇప్పటికిప్పుడు రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపకున్నా..రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి సొంతగా క్యాడర్ ను తయారు చేసుకోవాలనే నిర్ణయానికి జనసేనాని వచ్చినట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ బలపడడానికి ఇదే మంచి తరుణంగా జనసైనికులు చెబుతున్నారు. ఎలాగో మరి కొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా జరగబోతున్నాయి. అక్కడి నుంచే పార్టీ బలోపేతానికి సిద్దం అవ్వాలనే ఆలోచన చేస్తున్నారట జనసైనికులు. అంతకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడం కూడా పార్టీ బలోపేతానికి కలిసి వచ్చే అవకాశంగా జనసైనికులు భావిస్తున్నారట. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీతో కూటమిగా ఏర్పడి స్థాని సంస్థల ఎన్నికల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ పోటీ చేస్తే ఇక్కడ అద్భుతాలు చేయవచ్చు అని తెలంగాణ జసనేన ముఖ్య నేతలు ఆశపడుతున్నారట.ఒక సారి పూర్తి స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పడితే ప్రజా సమస్యలపై పోరడాడానికి తాము సిద్దంగా ఉన్నామని జనసైనికులు చెప్పుకొస్తున్నారు. పవన్ అభిమానులు, తెలంగాణ జన సైనికులు ఆలోచనా ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఏదీ స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడే ఏపీలో అధికార భాగస్వామిగా ఉన్న తమపై అనేక భాద్యతలు ఉన్నాయని.. ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలపైనే తమ దృష్టి అంతా అని పవన్ సైలెంట్ అవుతారా అనేది చూడాలి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో పార్టీనీ యాక్టివ్ చేయాలన్న జనసైనికుల కలలపై కళ్యాణ్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter