అమరావతి : రాష్ట్రం నలుమూలల నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు జనాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఆరు నుంచి ఎనిమిది డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పనులపై ఇళ్ల నుంచి బయటికొచ్చే వారు ఎండవేడికి తాళలేక అవస్థలు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు శరీరానికి మంటపుట్టిస్తున్నాయి. దీంతో వీధుల్లో వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులు, పనులపై బయట తిరిగే సాధారణ జనం వడదెబ్బ బారినపడుతున్నారు. రానున్న మూడు, నాలుగు రోజుల వరకు అధిక ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పోలవరంలో శనివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.