జామ్నగర్: తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని, తక్షణమే తగినంత పోలీసు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నేత, పటేల్ సామాజిక వర్గ ఉద్యమసారథి హార్థిక్ పటేల్ జామ్నగర్ జిల్లా ఎస్పీని కోరారు. నేడు జామ్నగర్లో రోడ్ షో చేపట్టనున్న నేపథ్యంలో అసాంఘీక శక్తులు తనపై దాడికి పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తపరుస్తూ హార్థిక్ పటేల్ శనివారం జిల్లా ఎస్పీకి ఓ లేఖ రాశారు. తనకు అందిన విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు తనపై కానీ లేదా తన కారుపై కానీ దాడి జరిగే అవకాశం ఉందని, తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని హార్థిక్ పటేల్ తన లేఖలో పేర్కొన్నారు.
హార్ధిక్ పటేల్ శుక్రవారం ఓ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతుండగా ఉన్నట్టుండి వేదికపైకి వచ్చిన ఓ వ్యక్తి.. హార్థిక్ పటేల్ చెంప చెళ్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మరునాడైన శనివారం కూడా హార్థిక్ పటేల్ పాల్గొన్న ఓ బహిరంగ సభలో కొంతమంది అల్లరిమూకలు అలజడి సృష్టించాయి. హార్థిక్ పటేల్ మాట్లాడటం మొదలుపెట్టగానే సభా ప్రాంగణంలోని కుర్చీలు విసిరేస్తూ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. నిశ్శబ్ధంగా ఉండాల్సిందిగా హార్ధిక్ పటేల్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. అల్లరిమూకలు ఆయన మాటలు వినిపించుకోలేదు. దీంతో ఆదివారం నాటి రోడ్ షోలోనూ హింస చెలరేగే ప్రమాదం లేకపోలేదని భావిస్తున్న నేపథ్యంలోనే హార్థిక్ పటేల్ జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్టు తెలుస్తోంది.