వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణమం చోటు చేసుకుంది. ఈ హత్యతో ప్రవేయం ఉందని అనుమానిస్తు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో వివేక వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రకాశ్ ఉన్నారు. ఈ మేరకు అరెస్టు చేసినట్టు పులివెందుల పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
వివేకా హత్యకేసు విచారణలో భాగంగా అనేక మందిని విచారించిన తర్వాత ఈ మేరకు అరెస్ట్ చేశారు. హత్యానంతరం సాక్ష్యాలు తారుమారు చేసిన వ్యవహారంలో ముగ్గురి ప్రవేయం ఉందనే అనుమానంతో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వివేకా మృతదేహాన్ని పడక గదికి తరలించినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్టు భావిస్తున్నారు. పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్ రక్తపు మరకలు కడిగాడని పేర్కొన్నారు. ఉదయం లేఖ దొరికినా సాయంత్రం వరకు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదనే కారణంతో ఆయన పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.