యుద్ధపూరిత వాతావరణం నేపథ్యంలో అప్రమత్తత అవసరం: పాక్

ఇరు దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణం: పాక్

Last Updated : Feb 26, 2019, 10:15 PM IST
యుద్ధపూరిత వాతావరణం నేపథ్యంలో అప్రమత్తత అవసరం: పాక్

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొని వుందని, అందరం అప్రమత్తంగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి అన్నారు. పాకిస్తానీయులం యుద్ధ వాతావరణంలో ఉన్నాం అని మీడియా సమావేశంలో ప్రకటించిన షా మహ్మద్ ఖురేషి.. దీనిపై బుధవారం పార్లమెంటు సమావేశం జరిపి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని తన ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్గత రాజకీయాలు చేసే సమయం కాదని.. విభేదాలన్నీ పక్కనపెట్టి, పాకిస్తాన్ అంతా ఐకమత్యంతో మెలగాల్సిన తరుణం అని ఖురేషి తెలిపారు. 

ఇదిలావుంటే, భారత వైమానిక దాడులపై పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. భారత యుద్ధ విమానాలు సరిహద్దు నియంత్రణ రేఖను దాటి ఉల్లంఘనలకు పాల్పడ్డాయని పాక్ అభిప్రాయపడింది. ఈ అంశంపై చర్చించేందుకు బుధవారం పాకిస్తాన్‌ ఉభయ సభలు సమావేశం కానున్నాయి. భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంపైకి వెళ్లి రావడాన్ని ఆ దేశం తీవ్రమైన పరిణామంగా భావిస్తున్నాయి.

Trending News