Telangana Formation Day: పద్నాలుగేళ్ల పోరాటం.. పదేళ్ల పరిపాలన చేసిన బీఆర్‌ఎస్ పార్టీ తొలిసారి ప్రతిపక్ష హోదాలో తెలంగాణ అవతరణ వేడుకలు చేసుకుంది. సీఎంగా కేసీఆర్ ప్రారంభించిన దశాబ్ది ఉత్సవాలను బీఆర్‌ఎస్ పార్టీ ముగింపు కార్యక్రమాలు నిర్వహించింది. మూడు రోజుల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో జెండావందనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనలో తాను పడ్డ కష్టాలు, అమరవీరుల త్యాగాలు, ఉద్యమ సహచరులను కోల్పోవడం, నాటి తెలంగాణ దుస్థితి వంటి వాటిని తలచుకుని కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. చాలా మంది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తలకెత్తుకున్నారని.. కానీ వారి స్వార్థ రాజకీయాల కోసం వదిలేశారని గుర్తు చేశారు. తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీ స్పీకర్ నిషేధించిన కాలం నుంచి నేడు సగర్వంగా రాష్ట్రంగా నిలిచిన కాలం తనకు గుర్తుంటుందని తెలిపారు. 'ఉమ్మడి ఏపీలో అడుగడుగనా తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణకు చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే ఏదో ఒక వివాదం సృష్టించి పదవి నుంచి దించేసేవాళ్లు. ఉద్యమ రూపాలు నెమరువేసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది' అని కేసీఆర్ ఉద్యమ కాలాన్ని గుర్తు చేసుకున్నారు.
ఎన్నికల ఫలితాలపై మరోసారి కేసీఆర్ స్పందిస్తూ.. 'అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యం ఉన్నాం. కానీ బస్సు యాత్ర చేపట్టగానే మళ్లీ అదే గర్జన కనిపించింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది బీఆర్‌ఎస్ పార్టీనే' అని విశ్వాసం వ్యక్తం చేశారు. తన పాలన కాలాన్ని గుర్తు చేసుకుంటూ చేప పిల్లలు, గొర్రె పిల్లల పంపిణీ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం వంటి వాటిని గుర్తు చేశారు. '1.08 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. కానీ గులాబీ జెండా పుట్టింటే తెలంగాణ రక్షణ కోసం. రాజకీయం నిరంతర ప్రవాహం. అధికారంలో ఉంటేనే రాజకీయం కాదు. ప్రజల కోసం పని చేయడమే మన కర్తవ్యం' అని కేసీఆర్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారని కేసీఆర్ అభినందించారు. వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రాకేశ్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఎగ్జిట్ పోల్స్‌పై స్పందిస్తూ..
లోక్‌సభ ఎన్నికలపై విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పై కేసీఆర్ స్పందించారు. 'ఎగ్జిట్ పోల్స్ అనేవి ఓ గ్యాంబ్లింగ్‌లా తయారయ్యాయి. ఒక్కో సంస్థ ఒక్కోలా లెక్కలు చెబుతున్నాయి. రాజకీయ ఫలితాలు వస్తుంటాయి.. పోతుంటాయి. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో పని చేస్తూనే ఉండాలి. ఎక్కువ వస్తే కుంగిపోయేది లేదు. తక్కువ వచ్చినా కుంగిపోయేది లేదు. రాజకీయ జయపజయాలు మనకు లెక్క కాదు. కానీ తెలంగాణ రక్షణ కవచం మాత్రం బీఆర్‌ఎస్ పార్టీ' అని కేసీఆర్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter