అతని క్రికెట్ "వేరీ వేరీ స్పెషల్"

  

Last Updated : Nov 1, 2017, 08:26 PM IST
అతని క్రికెట్ "వేరీ వేరీ స్పెషల్"

ఓ తెలుగు కుర్రాడు క్రికెటర్‌గా సత్తా చాటడమే కాదు.. అదే రంగంలో తిరుగులేని ధ్రువతారగా కూడా వెలిగాడు. భారతజట్టుకు మరపురాని విజయాలను అందించి "వేరీ వేరీ స్పెషల్" హీరో అనిపించుకున్నాడు. ప్రపంచ మేటి క్రికెటర్లలో ఒకరిగానూ ఘనతకెక్కాడు.. అతడే వీవీఎస్ లక్ష్మణ్ అలియాస్ వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్. క్రికెట్ చరిత్రలో తెలుగు వాడి సత్తాని లోకానికి చాటిన ఈ రియల్ హీరో గురించి ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం

  • హైదరాబాద్‌లో ప్రముఖ వైద్యులైన డాక్టర్ శాంతారామ్, సత్యభామ దంపతులకు 1 నవంబరు, 1974 తేదీన జన్మించారు వీవీఎస్ లక్ష్మణ్. చిన్నప్పుడు లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో చదువుకున్న లక్ష్మణ్ కూడా తన తల్లిదండ్రుల మాదిరిగానే తొలుత డాక్టర్ అవ్వాలని భావించారట. అయితే క్రికెట్ పైన అమితమైన ఇష్టం పెంచుకున్న ఆ కుర్రాడికి, తన తల్లిదండ్రులు ప్రోత్సాహం కూడా అండగా నిలవడంతో అదే రంగంలో దూసుకుపోయాడు. 
  • 1991లో తొలిసారిగా అండర్ 19 జట్టు తరఫున ఆస్ట్రేలియాపై ఆడిన లక్ష్మణ్ తొలి ఆటలో 88 పరుగులు చేసి, రెండవ ఆటలో 151 పరుగులతో దూసుకుపోయాడు. అయితే టెస్టు మ్యాచ్‌ల్లో చూపించిన ప్రతిభ, అదే టీమ్ తరఫున వన్డేల్లో చూపించలేకపోయాడు. 1992లో తొలిసారిగా హైదరాబాద్ జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ కెరీర్ ప్రారంభించిన లక్ష్మణ్, ఆ ఆటలో పెద్దగా రాణించలేకపోయినా, రంజీ ట్రోఫీ సీజనులో రెండు సెంచరీలు చేసి తన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అదే దూకుడును దులీప్ ట్రోఫీలో కూడా కొనసాగించాడు

  • 1996లో దక్షిణాఫ్రికా జట్టుతో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టు క్రికెట్ మ్యాచ్‌‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన లక్ష్మణ్ 50 పరుగులు చేశాడు. అయితే వరుసగా మూడు సంవత్సరాలు వివిధ మ్యాచ్‌ల్లో అతని వైఫల్యం అయిన తీరుపై సెలక్టర్ల కినుక వహించినా, 2000లో సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో 167 పరుగులు చేసి తన సత్తా చాటాడు లక్ష్మణ్. 
  • 2001లో కలకత్తాలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్టులో అత్యంత ఒత్తిడితో ఫాలో ఆన్ ఆడుతూ, 281 పరుగులు చేయడంతో లక్ష్మణ్ పేరు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సంచలనమైంది. ఆ టెస్టులో తన స్కోరు ద్వారా సునీల్ గవాస్కర్ పేరు మీదున్న 236 నాటౌట్ రికార్డును అధిగమించాడు లక్ష్మణ్. వీరేంద్ర సెహ్వాగ్ 2004లో పాకిస్తాన్‌పై 309 పరుగులు చేసేంతవరకూ ఆ రికార్డు పదిలంగా ఉంది
  • ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్ టెస్టులో చేసిన 148 పరుగులు, సిడ్నీ టెస్టులో చేసిన 178 పరుగులు జట్టులో లక్ష్మణ్ స్థానాన్ని పదిలం చేశాయి. ఇయాన్ ఛాపెల్ లాంటి వారు లక్ష్మణ్‌ను "వేరీ వేరీ స్పెషల్ క్రికెటర్" అని అభివర్ణించారు. 
  • టీమిండియా బ్యాటింగ్‌లో లైనప్‌లో వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీల శకాన్ని గోల్డెన్ జనరేషన్‌ అని చెప్పుకోవచ్చు. ఈ నలుగురిని "ఫ్యాబ్ ఫోర్"గా చాలామంది అభిమానులు భావిస్తారు. 
  • లక్ష్మణ్ ఇంతవరకు 127 టెస్టు మ్యాచ్‌లు మరియు 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 16 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. 2001లో లక్ష్మణ్‌ను అర్జున్ అవార్డు వరించింది. 2002లో విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. 
  • 2004లో ఆస్ట్రేలియాతో  ముంబయిలో జరిగిన టెస్ట్‌లో 69 పరుగులు సాధించినా అవి విజయానికి దోహదపడలేదు. ఆ టెస్ట్ భారత్ గెలిచినప్పటికి సిరీస్ కోల్పోయింది. 2008 సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ దక్కన్ చార్జర్స్‌కు లక్ష్మణ్ నేతృత్వం వహించాడు. 
  • 2010లో భారత ప్రభుత్వం లక్ష్మణ్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆగస్టు 2012లో లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో 16 సంవత్సరాల పాటు సేవలందించిన ఈ హైదరాబాదీ కుర్రాడు తన సొంత మైదానం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 

 

Trending News