ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కులశేఖర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నువ్వు నేను, జయం, చిత్రం, ఔనన్నా కాదన్నా లాంటి సినిమాలకు పాటలు రాసిన కులశేఖర్ గతకొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.గతంలో కాకినాడలోని ఆంజనేయస్వామి గుడిలో శఠగోపం దొంగలించిన కేసులో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించిన కులశేఖర్.. ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా ఉండడం లేదని.. ఆయన ఏం చేస్తున్నాడో తనకే తెలియదని గతంలో ఆయన కుటుంబీకులు తెలిపారు.
కులశేఖర్ స్వస్థలం విశాఖపట్నంలోని సింహాచలం. గీత రచయితగా మారాకే ఆయన హైదరాబాద్ నగరానికి షిఫ్ట్ అయ్యారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని మాతా దేవాలయంలో పనిచేస్తున్న పూజారి చేతి సంచిని కులశేఖర్ చోరీ చేశారు. తర్వాత శ్రీనగర్ కాలనీలోని దేవాలయంలో కూడా దొంగతనం చేయాలని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఆ ఆలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న కులశేఖర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు కులశేఖర్ వద్ద నుండి 10 సెల్ ఫోన్లు, చేతి సంచులు, క్రెడిట్ డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. తను గీత రచయితగా మారాక.. రాసే పాటలు తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని పలుమార్లు బ్రాహ్మణులు తనను హెచ్చరించారని.. తనను కులానికి దూరం చేశారని కులశేఖర్ అన్నట్లు తెలుస్తోంది. అందుకే పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడుతున్నట్లు కులశేఖర్ పేర్కొన్నట్లు పలు పత్రికలు వార్తలు రాయడం జరిగింది.