నటీనటులు : రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, ప్రణీత
ఛాయాగ్రహణం: విజయ్ కె.చక్రవర్తి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
కథ-స్క్రీన్ ప్లే-మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సమర్పణ: దిల్ రాజు
నిర్మాతలు: లక్ష్మణ్ – శిరీష్
దర్శకత్వం : త్రినాధరావు నక్కిన
డ్యూరేషన్ : 145 నిమిషాలు
సెన్సార్: క్లీన్-U
విడుదల తేది : 18 అక్టోబర్ 2018
ఓ మంచి హిట్ కోసం చూస్తున్నాడు రామ్. అందుకే మరోసారి తనకు ఎంతో అలవాటైన ప్రేమకథను సెలక్ట్ చేసుకున్నాడు. హలో గురు ప్రేమకోసమే అంటూ ఈరోజు థియేటర్లలోకి వచ్చిన రామ్, హిట్ కొట్టాడా..? జీ న్యూస్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ
స్టోరీలైన్
కాకినాడలో ఉండే సంజు (రామ్) సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తాడు. సంజు తల్లికి స్నేహితుడైన విశ్వనాధం ఇంట్లో ఉంటాడు. అక్కడే విశ్వనాధం కూతురు అనుపమ (అనుపమ పరమేశ్వరన్)తో పరిచయం అవుతుంది. ఇక ఆఫీస్ లో ప్రణీతతో పరిచయం అవుతుంది. ప్రణీతను ప్రేమిస్తున్నానని రామ్ అనుకుంటాడు. కానీ ఆ జర్నీలో తను ప్రణీత కంటే అనునే ఎక్కువగా లవ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుంటాడు.తన ప్రేమను అనుకు చెబుదామనుకున్న టైమ్ కు విశ్వనాధం కూతురుకు వేరే సంబంధం చూస్తాడు. మరోవైపు అను కూడా రామ్ ను ప్రేమిస్తున్న విషయాన్ని ఆఖరి నిమిషం వరకు చెప్పదు. మాటకు విలువిచ్చే విశ్వనాధంను సంజు ఎలా మార్చాడు.. తను ప్రేమించిన అను ను ఎలా సొంతం చేసుకున్నాడు.. అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు
ఎనర్జిటిక్ స్టార్ అనే బిరుదుకు మరోసారి న్యాయం చేశాడు రామ్. ఎంతో అలవాటైన ప్రేమకథలో అవలీలగా ఒదిగిపోయాడు. అతడి కామెడీ టైమింగ్, యాక్షన్ చాలా బాగున్నాయి. ఇక రామ్ డాన్స్ గురించి కొత్తగాచెప్పేదేముంది. ఎప్పట్లానే అద్భుతంగా డాన్స్ చేశాడు. ఈసారి పాపింగ్ అనే కొత్త స్టయిల్ ఆఫ్ డాన్స్ ను కూడా ఇంట్రడ్యూస్ చేశాడు.రామ్ తర్వాత చెప్పుకోవాల్సిన పాత్ర ప్రకాష్ రాజ్. మాట మీద నిలబడే వ్యక్తిగా, కూతుర్ని ప్రేమించే సగటు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. ఇలాంటి పాత్రలు ప్రకాష్ రాజ్ కు కొత్తకాదు. అందుకేనేమో రామ్, ప్రకాష్ రాజ్ ను సెకెండాఫ్ లో ఫ్రెండ్స్ గా మార్చి కాస్త కొత్తదనం చూపించారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు ఇలాంటి పాత్రలు కొత్తకాదు. అందుకేనేమో ఆమె క్యారెక్టర్ లో కొత్తదనం కనిపించలేదు. ఇక ప్రణీత చేసిన పాత్ర చాలా చిన్నది. కానీ ఉన్నంతలో బాగుంది. సినిమాలో హిట్ సాంగ్ కూడా ప్రణీతకే పడింది. ప్రవీణ్, పోసాని, సత్య, సప్తగిరి తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీషియన్స్ పనితీరు
ఈ సెగ్మెంట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి బెజవాడ ప్రసన్నకుమార్. ఈ కథ అతడిదే. డైలాగ్స్ కూడా అతడు రాసినవే. స్క్రీన్ ప్లే కూడా అతడిదే. రొటీన్ గా ఉండే స్టోరీకి కొంచెం కొత్తగా ఉండే సన్నివేశాలు బాగానే రాసుకున్నాడు బెజవాడ. అటు ఫన్నీ డైలాగ్స్, ఇటు ఎమోషనల్ డైలాగ్స్ బాగా రాశాడు. ఎటొచ్చి ఇతడు రాసిన పొడుగాటి డైలాగులు కొన్ని అస్సలు అర్థంకాలేదు. కొన్ని చోట్ల ఎక్స్ ప్రెషన్స్ తో పోయేదానికి కూడా డైలాగ్స్ రాసి నిడివి పెంచేశాడు. దర్శకుడు త్రినాథరావు నక్కినకు సినిమాటోగ్రాఫర్ విజయ్ చక్రవర్తి నుంచి మంచి సహకారం దొరికింది. వీళ్లిద్దరూ కలిసి సినిమాలో కొన్ని కలర్ ఫుల్ ఫ్రేమ్స్ చెక్కారు. సురేష్ ఆర్ట్ వర్క్, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఓకే. సినిమా నిడివి తక్కువే అయినప్పటికీ ఇంకా తగ్గించొచ్చు. ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన పాటల్లో ‘పెద్ద పెద్ద కళ్లతోటి’ అనే సాంగ్ హమ్మింగ్ చేసుకునేలా ఉంది. ‘నేటివ్ ప్లేస్’ అనే పాట బాగుంది. క్లైమాక్స్ కు ముందు పెట్టిన మాస్ సాంగ్ అవసరం లేదు. టోటల్ గా ఈ కథకు, సినిమా టెంపోకు అస్సలు ఆ మాస్ సాంగ్ సెట్ అవ్వలేదు. రామ్ తో స్టెప్స్ వేయించడం కోసం పెట్టినట్టుంది. ఇక బ్యాక్ గ్రౌడ్ స్కోర్ విషయంలో కూడా దేవికి పాస్ మార్కులే పడతాయి. నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
జీ సినిమాలు రివ్యూ
ఎనర్జిటిక్ రామ్ నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారు? నేను లోకల్ లాంటి సినిమా తీసిన త్రినాథరావు నక్కిన నుంచి ఎలాంటి సినిమా ఆశిస్తారు? క్లీన్ మూవీలు తీసే బ్రాండ్ ఇమేజ్ ఉన్న దిల్ రాజు నుంచి ఏ టైపు మూవీ వస్తుంది..? వీళ్ల ముగ్గుర్ని దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన సినిమా హలో గురు ప్రేమకోసమే. అంతకుమించి అదనంగా ఏది కోరుకున్నా ఆశాభంగం తప్పదు. అవును.. హలో గురు ప్రేమకోసమే సినిమాలో రామ్ ఎనర్జిటిక్ యాక్షన్, త్రినాథరావు నక్కిన స్టయిల్ ఆఫ్ కామెడీ, దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రమే కనిపిస్తాయి. నిజానికి ఈ మూడు ఎలిమెంట్స్ క్లిక్ అయితే చాలు. సినిమా సూపర్ హిట్ అయిపోతుంది. కానీ మూడింటినీ కలిపే ఎమోషనల్ టచ్ ఒకటి ఉండాలి. సరిగ్గా అదే ఈ సినిమాలో మిస్ అయింది. క్లయిమాక్స్ లో కూడా ఏం జరుగుతుందో సినిమా పూర్తవ్వడానికి అర్థగంట ముందే ఊహించేసుకోవచ్చు.
దీనికి తోడు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన ప్రేమను తెలిపే కీలకమైన సన్నివేశం సినిమా గ్రాఫ్ ను తగ్గించింది. హలో గురు ప్రేమకోసమే అంటూ తీసిన ఈ ప్రేమకథలో మనసుకు హత్తుకునే లవ్ సీన్స్, హమ్మింగ్ చేసుకునే లవ్ సాంగ్స్, గుండె బరువెక్కించే ఎమోషనల్ సన్నివేశాలు కనిపించవు. నిజానికి ఈ సినిమాలో ఇవన్నీ ఉన్నాయి. కానీ పూర్తిస్థాయిలో ఆ ఫీలింగ్ ను అందించలేకపోయాయి. చివరికి కామెడీ కూడా అంతే. ఉందంటే ఉంది. పొట్టచెక్కలయ్యే కామెడీ కాదు, పెదాలపై నవ్వుతెప్పించే హాస్యం మాత్రమే. అంతెందుకు, తన మ్యూజిక్ తో ఎన్నో సినిమాల్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా జస్ట్ ఉందంటే ఉంది. మేజిక్ చేయలేదంతే.సినిమా స్టార్టింగ్ నుంచి క్లయిమాక్స్ వరకు అలా సాగిపోతుందంతే. ఎక్కడా బోర్ కొట్టదు, అలా అని ఎగ్జైట్ కూడా చేయదు. ఉన్నంతలో తన యాక్టింగ్, కామెడీ టైమింగ్, డాన్స్ తో కట్టిపడేశాడు రామ్. యూత్ సబ్జెక్ట్ కావడం, కామెడీ కూడా మిక్స్ చేయడంతో ఈ దసరా సీజన్ లో సినిమా ఈజీగా పాస్ అయిపోతుంది.
బాటమ్ లైన్ – హలో గురు ‘కామెడీ’ కోసమే
రేటింగ్ – 2.75/5
(జీ సినిమాలు సౌజన్యంతో)