Padma Awards 2024 Winners List: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవిని దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో వీరు పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. వీరితో పాటు బిందేశ్వర్ పాఠక్, వైజయంతిమాల బాలి, పద్మా సుబ్రహ్మణ్యంలకు పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్లాల్, కూరేళ్ల విఠలాచార్య పద్మశ్రీ అవార్డులకు ఎంపిక అయ్యారు. హరి కథాగానం చేసిన తొలి మహిళ ఏపీకి చెందిన ఉమా మహేశ్వరిని పద్మశ్రీ అవార్డు వరించింది.
"అమృత కాలం దిశగా భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. దేశంలోని రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ నా ఈ పురస్కారాన్ని సగర్వంగా అంకితం చేస్తున్నాను. ఈ పురస్కారం నా బాధ్యతను మరింతగా పెంచిందని భావిస్తూ నవభారత నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. శక్తివంతమైన, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలసి నడుస్తానని ప్రజలకు సవినయంగా తెలియజేస్తున్నాను..." అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
చిరంజీవి, వెంకయ్య నాయుడులకు పద్మవిభూషణ్ అవార్డులు వరించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. "భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య చిరంజీవి గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గారు ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు. రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ వెంకయ్య నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను.
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కళా, సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషకరం. మచిలీపట్నానికి చెందిన హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరి గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్ష గాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారు, స్థపతి శ్రీ వేలు ఆనందాచారి గారు, బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప గారు, సాహిత్య విభాగం నుంచి కేతావత్ సోంలాల్ గారు, కూరెళ్ళ విఠలాచార్య గారు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందదాయకం. వారికి నా అభినందనలు.." అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Also Read: MP Bandi Sanjay: ఎన్నికల్లో మీ దమ్మేందో చూపించండి.. ఓటనే ఆయుధంతో ఉచకోత కోయండి: బండి సంజయ్
Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ... ప్రపంచంలో ఒకే ఒక్కడు..
అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter