జనాలకు దర్శనమిచ్చిన దేవత

నేపాల్ ప్రజలకు దర్శనమిచ్చిన దేవత

Last Updated : Sep 26, 2018, 06:49 PM IST
జనాలకు దర్శనమిచ్చిన దేవత

నేపాల్ ప్రత్యక్ష దేవత తొలిసారి ప్రజలకు దర్శనమిచ్చింది. నేపాల్ ప్రజలు ఘనంగా జరుపుకొనే సంప్రదాయ పండగ 'ఇంద్ర జాత్ర' సందర్భంగా ప్రత్యక్ష దేవత త్రిష్ణ శాక్య ప్రజలకు కనిపించారు. గతేడాది సెప్టెంబర్‌లో దైవ దీక్ష తీసుకున్న త్రిష్ణ శాక్యను నేపాల్ ప్రజలు ప్రత్యక్ష దేవత (సజీవ దేవత)గా ఆరాధిస్తారు.

ఎనిమిది రోజుల పాటు జరిగే ఇంద్ రజాత్ర పండగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. సంప్రదాయ నృత్యాలు, వస్త్రధారణతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారు స్వర్గలోకాధిపతి ఇంద్రుడిని పూజిస్తారు. ఇది నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో జరిగే సంప్రదాయ ఉత్సవం. దీనిని యెన్య లేదా ఇంద్ర జాత్ర అని కూడా పిలుస్తారు. 'యెన్' అంటే 'ఖాట్మండ్' అని, 'యా' అంటే 'వేడుక/ఉత్సవం' అని అర్థం. 'ఖాట్మండ్‌లో జరిగే ఉత్సవం' అని దీని పూర్తి అర్థం. ఈ ఉత్సవాల్లో రెండు ఘట్టాలు ఉంటాయి. ఒకటేమో ఇంద్రజాత్ర.. మరొకటేమో కుమారి జాత్ర. ఇంద్ర జాత్ర సందర్భంగా భక్తులు దేవతలు, రాక్షసుల మాస్కులను ధరించి నృత్యాలు చేస్తారు. కుమారి జాత్రలో ప్రత్యక్ష దేవత 'కుమారి' రథయాత్ర ఉంటుంది.

త్రిష్ణ శక్య.. కుమారి దేవత నివాసస్థలమైన 'కుమారి ఘర్' అనే ప్యాలెస్‌లో ఉంటారు. ఇది బసంత్‌పూర్‌లోని దర్బార్ స్క్వేర్ ప్రాంతంలో ఉంటుంది. ఇది యునెస్కో చేత గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటి. సోమవారం ఉత్సవాల్లో భాగంగా ప్యాలెస్ నుంచి రథంపై కుమారి దేవతను తీసుకొచ్చి ఖాట్మండ్ వీధుల్లో ఊరేగించారు.

ఖాట్మండ్ వ్యాలీకి చెందిన నేవర్ తెగ నుండి వచ్చిన బాలికను పూజించడం నేపాల్‌లో ఉన్న ఓ సంప్రదాయం. హిందూ, బౌద్ధ మత ఆచారాలు కలగలసిన నేవర్ తెగలోని పిల్లల్ని మాత్రమే కుమారి దేవతగా ఎంపిక చేసుకోవడం ఆనవాయితీ.

'కుమారి'ని ఎంచుకొనే సమయంలో పూజారులు వివిధ కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. త్రిష్ణ శక్యకు ముందు ఉన్న మతైనే శాక్య యవ్వనంలో అడుగుపెట్టడంతో గత ఏడాది నలుగురు పోటీపడగా.. త్రిష్ణ శాక్య 'కుమారి దేవత'గా ఎంపికైంది.

ఏడాదికి 13 రోజులు మాత్రమే ప్యాలెస్ నుంచి 'కుమారి దేవత' బయటకు వస్తారు. ఆ సమయంలో ఆమెను సేవకులు రథంపై ఊరేగింపుగా తీసుకువస్తారు. మ‌హార్నవ‌మి రోజున‌ నేపాల్ రాజుల ర‌క్షకురాలిగా కొలిచే త‌లేజు భ‌వానీ అమ్మవారికి 'కుమారి దేవ‌త' పూజ‌లు చేయాలి. అప్పుడు అమ్మవారి శ‌క్తుల‌న్నీ కుమారి దేవ‌త శ‌రీరంలోకి ప్రవేశిస్తాయని నేపాలీల న‌మ్మకం.

 

Trending News