విశాఖలో మావోయిస్టుల దాడి ఘటన అనంతరం పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మరే ఘటనలు చోటుచేసుకోకుండా ఉండటానికి తెలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పోలీసులు వెంట లేనిదే బయట ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బయట తిరగొద్దని అప్రకటిత ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల్లో మంత్రులకు భద్రత పెంచేసింది ప్రభుత్వం.
విశాఖ జిల్లా డుంబ్రీగూడ మండలంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. దాడి సమయంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ, అనుచరులు ఉన్నారు. మావోయిస్టుల కాల్పుల్లో సర్వేశ్వరరావుతో పాటు సివేరు సోమ కూడా అక్కడే మృతి చెందారు. దాడిలో 50 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి పోలీసులు నక్సల్స్ కోసం ఏజెన్సీ ప్రాంతం అంతా జల్లెడ పడుతున్నారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
అటు విశాఖ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ మన్యంలో ఎమ్మెల్యేలపై మావోయిస్టుల దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. దాడులు, హత్యలు మానవత్వానికే మచ్చ అని, ప్రజాస్వామ్యవాదులంతా ఈ ఘటనను ఖండించాలని అన్నారు. కిడారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అటు మావోయిస్టుల దాడి సమాచారం అందుకున్న వెంటనే.. సీఎం ఆదేశాల మేరకు ఏపీ హోంమంత్రి చినరాజప్ప, ఏపీ డీజీపీ ఠాకూర్ హుటాహుటిన విశాఖ బయలుదేరి వెళ్లారు. విశాఖ మన్యంలో ఎమ్మెల్యేలపై కాల్పుల ఘటన తెలిసిన వెంటనే చినరాజప్ప పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అమెరికాలో ఉన్న సీఎం చంద్రబాబుకు చినరాజప్ప పరిస్థితిని వివరించారు. చంద్రబాబు అమెరికా నుండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు.
Visakhapatnam: #Visuals from the spot where TDP leaders Kidari Sarveswara Rao & Siveri Soma, present and former MLA from Araku respectively, were shot dead by Naxals today. #AndhraPradesh pic.twitter.com/RoFBBHQUK7
— ANI (@ANI) September 23, 2018