Telangana Exit Poll District Wise Results: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ యుద్ధం ముగిసింది. 119 అసెంబ్లీ స్థానాలకు గురువారం తెలంగాణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో ఓటర్లు భద్రపరిచారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు 70.66 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా పూర్తిస్థాయిలో రిపోర్ట్ వెల్లడికావాల్సి ఉంది. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వత్రా ఉత్కంఠ రేపిన సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలింది. ఎక్కువ సర్వేలు కాంగ్రెస్‌కు మొగ్గు చూపగా.. కొన్ని సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టారు. మరికొన్ని సర్వేల్లో హంగ్ ఏర్పడుతుందని తేలింది. అయితే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని అందరిలోనూ ఆసక్తి ఉంది. గ్రౌండ్ లెవల్‌లో ఓటరు మాట ఎలా ఉంది..? ఎవరు గెలిచే అవకాశం ఉంది..?
ఉమ్మడి కరీంనగర్‌లో ఇలా..
ఉమ్మడి కరీంనగర్‌లో 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ నెలకొంది. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది. కోరుట్ల నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ వైపు కాస్త మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాలలో కాంగ్రెస్, పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడైంది. చొప్పదండిలో మేడిపల్లి సత్యం (కాంగ్రెస్), వేములవాడలో ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) ఆధిపత్యం కనబరిచే అవకాశం ఉంది. సిరిసిల్లలో కేటీఆర్‌కు గతంలో కంటే తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. హుజురాబాద్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు గత ఉప ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే తక్కువ ఓట్లతో గెలిచే ఛాన్స్ ఉంది. ఓవరాల్‌గా జగిత్యాల, కోరుట్ల, హుజురాబాద్‌లో త్రిముఖ పోరు ఉంది. మిగిలిన చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. మానుకొండూర్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం కనబరిచే అవకాశం ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలా..
ఉమ్మడి ఖమ్మంలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 8 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం కనబరిచే అవకాశం ఉంది. ఖమ్మం అర్భన్ నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ నెలకొంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వల్ప మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గెలిచే అవకాశం కనిపిస్తోంది. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్), మధిరలో భట్టి విక్రమార్క (కాంగ్రెస్) విజయం సాధించే ఛాన్స్ ఉంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లందు, వైరా కాంగ్రెస్ ఆధిపత్యం కనబరిచే అవకాశం ఉందని గ్రౌండ్ రిపోర్ట్‌లో తేలింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లా 12 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నాయి. ములుగు అసెంబ్లీ స్థానం నుంచి సీతక్క (కాంగ్రెస్) గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది. భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్), డోర్నకల్ కాంగ్రెస్, మహబూబాబాద్ కాంగ్రెస్, వరంగల్ తూర్పు కొండా సురేఖ (కాంగ్రెస్) ఆధిక్యం కనబరిచే ఛాన్స్ ఉంది. జనగాంలో బీఆర్ఎస్, స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్, పరకాల బీఆర్ఎస్, వర్ధన్నపేట బీఆర్ఎస్ విజయం సాధించే ఛాన్స్ ఉండగా.. పాలకుర్తి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడుస్తోంది. వరంగల్ వెస్ట్‌లో బీఆర్‌ఎస్ స్వల్ప మెజార్టీతో సాధించే అవకాశం ఉంది. నర్సంపేటలో కూడా భారీ పోరు ఉంది.
(మిగిలిన జిల్లాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయంది.. పార్ట్-2, పార్ట్-3)
Telangana Exit Poll Result 2023: అసెంబ్లీ స్థానాల వారీగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే.. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు..? (పార్ట్-1)