నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సెంట్రల్ నేపాల్‌లోని పర్వతప్రాంతంలో శనివారం ప్రయాణికులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో ఆరుగురు ప్రయాణీకులు, ఓ పైలెట్ ఉన్నారు. గోర్ఖా నుండి ఖాట్మాండ్కు ఈ హెలికాఫ్టర్ బయల్దేరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. జపాన్‌కి చెందిన పర్వతారోహకుడితో సహా హెలికాఫ్టర్‌లో మొత్తం ఆరుగురు ప్రయాణికులు, పైలట్ ఉన్నట్లు తెలిపారు.
‘‘హెలికాప్టర్ శిథిలాలను నువాకోట్-ధాఢింగ్ జిల్లా మధ్య పర్వతాల నడుమ దట్టమైన అటవీ ప్రాంతంలో గుర్తించాం.' అని అధికారులు తెలిపారు. 'ప్రమాదం జరిగిన ప్రదేశం 5,500 అడుగుల ఎత్తులో ఉంది. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయక చర్యలకు ఆటకం కలిగిస్తున్నాయి." అని ఓ అధికారి తెలిపారు.
నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ మాట్లాడుతూ, ప్రయాణీకులతో వెళ్తున్న హెలికాఫ్టర్ సత్యవతి అని పిలువబడే ప్రాంతంలో కూలిపోయినట్లు.. ఇదొక దట్టమైన అటవీ ప్రాంతంలో ఉందని తెలిపారు.
కాగా.. ఈ ఘటనలో జపాన్ పర్వతారోహకుడితో సహా మొత్తం ఆరుగురు మృతిచెందగా, ఓ మహిళా ప్రయాణికురాలిని సహాయ సిబ్బంది రక్షించారు.
2016లో ఖాట్మాండ్కు 22 కిలోమీటర్ల దూరంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. 2015లో వచ్చిన భూకంపం సమయంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను ఉపయోగించగా.. ఆ సమయంలోనూ కొన్ని ప్రమాదాలు జరిగాయి.