మేకపాలు తాగడం వల్ల ప్రయోజనాలివే

ఆవుపాల మాదిరిగానే మేకపాలు తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు పలువురు వైద్యులు.

Last Updated : Sep 8, 2018, 12:27 AM IST
మేకపాలు తాగడం వల్ల ప్రయోజనాలివే

ఆవుపాల మాదిరిగానే మేకపాలు తాగడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు పలువురు వైద్యులు. పోషక గుణాలు ఎక్కువగా ఉండే ఈ పాలను తాగడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రోటీన్స్, కాల్షియం ఎక్కువ ఉండే మేకపాలను తాగడం వల్ల కలిగే ఉపయోగాలేమిటో మనం కూడా తెలుసుకుందామా..!

*మేకపాలలో ట్రైటోఫాన్‌ అనే ఎమినో యాసిడ్స్‌ చాలా పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ సక్రమంగా అందుతాయని అంటున్నారు పలువురు వైద్యులు

*అలాగే ఒక కప్పు మేకపాలు తీసుకోవడం వల్ల 35 శాతం ఫ్యాటీ ఆమ్లాలను శరీరం అధికంగా పొందుతుందట. ఎముకల పటిష్టతకు, కీళ్ల నొప్పుల నివారణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయట.

*అదేవిధంగా మేకపాలలో ఉండే బయో ఆర్గానిక్‌ సోడియమ్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. కణాల వృద్ధికి కూడా మేకపాలు తాగడం మంచిదని కొందరి అభిప్రాయం.

*డెంగ్యూ సోకినవారి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. వారికి మేకపాలు ఇస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందని కొందరు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. 

*మహాత్మగాంధీ మేకపాలను ఎక్కువగా తాగడానికి కూడా ఓ కారణం ఉందట. చిన్నప్పుడు ఆయన అతిసార వ్యాధితో బాధపడుతూ.. ఆఖరికి ప్రాణాపాయ స్థితికి వెళ్లినప్పుడు.. వైద్యుల సలహా మేరకు మేకపాలు తాగి తిరిగి మామూలు మనిషి అయ్యారని ఓ కథ ప్రచారంలో ఉంది.

*కొన్ని దేశాల పాల ఉత్పత్తి కేంద్రాల్లో మేకపాలకు మంచి డిమాండ్ ఉంది. మేక పాల నుండి వెన్న, మీగడ, ఐస్ క్రీమ్ మొదలైన వాటిని కూడా తయారుచేస్తుంటారు.

*మేకపాలల్లో ఖర్జూర పండ్లను నానబెట్టుకొని తింటే.. లైంగిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కూడా కొన్ని గ్రంథాల్లో  రాయడం జరిగింది.

*రక్తహీనతతో బాధపడేవారికి కూడా మేకపాలు ఔషధంగా పనిచేస్తాయన్నది పలువురి అభిప్రాయం.

*అయితే మేకపాలను పసిపిల్లలకు పట్టేటప్పుడు తప్పకుండా డాక్టరు సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

*ఆవుపాలతో పోల్చుకుంటే మేకపాలు తొందరగా జీర్ణమవుతాయని కూడా పలువురు వైద్యులు చెప్పడం గమనార్హం.

Trending News