AP CM YS Jagan to inaugurate 5 medical colleges today: అమరావతి : ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కారు.. అందులో భాగంగానే నేడు 15వ తేదీన 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు స్పష్టంచేసింది.. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకకాలంలో 5 మెడికల్ కాలేజీల్లో అకడమిక్ తరగతుల ప్రారంభించనున్నట్టు ఏపీ సర్కారు తెలిపింది. ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నేడు విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నట్టు తాజాగా ఏపీ సర్కారు ఓ ప్రకటనలో పేర్కొంది.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏపీలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు కాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు చేశామని.. ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో తీసుకొచ్చామని ఏపీ సర్కారు వెల్లడించింది. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య నాలుగేళ్లలో 966 నుంచి 1,767 కు పెంచినట్టు తెలిపింది.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల టోల్ ఫ్రీ నెంబర్ 104 లేదా 1902 మల్టీ, సూపర్ స్పెషాలిటీ, అధునాతన వైద్యసేవలను ఉచితంగా అందుబాటులోకి తెస్తూ.. ప్రతి మెడికల్ కాలేజీలో రూ. 500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నిర్మాణాల గురించి వివరాలు వెల్లడించింది. 8.5 లక్షల చ|| అ॥ ల విస్తీర్ణంలో టీచింగ్ హాస్పిటల్ , 2.5 లక్షల చ॥ అ॥ ల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ, 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్టళ్లు, సిబ్బంది వసతి, క్రీడా ప్రాంగణాలు.. అత్యాధునిక సాంకేతికతతో లాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీ, సీసీ టీవీల ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టంచేసింది.
దేశానికే దిక్సూచిగా వైద్య ఆరోగ్య రంగంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు తీసుకొచ్చినట్టు ప్రకటించిన ఏపీ సర్కారు.. 2024-25 లో పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె కేంద్రాలుగా మరో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. అలానే 2025-26 లో పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ళ, పెనుకొండ కేంద్రాలుగా మరో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్టు స్పష్టంచేసింది. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకొస్తూ సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురం, బుట్టాయిగూడెం, దోర్నాల 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని ఏపీ సర్కారు తమ ప్రకటనలో పేర్కొంది. ఇవే కాకుండా పలాసలో కిడ్నీ రిసెర్చ్ సెంటర్, తిరుపతిలో శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, కడపలో మానసిక ఆరోగ్య కేంద్రం పేరిట 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది.