Aditya L1 Launch Updates: సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్‌డౌన్ పూర్తి చేసుకున్న పీఎస్ఎల్వీ-C57 రాకెట్ ఆదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి సూర్యుడి ఎల్ 1 కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. అనంతరం అందులోని ఏడు పేలోడ్లు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తాయి. చంద్రయాన్ 3 సక్సెస్ తరువాత ఆదిత్య ఎల్ 1 ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ ఆదిత్య L1ను తీసుకుని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లింది. అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత భానుడిపైకి రాకెట్ పంపిన దేశంగా భారత్ నిలిచింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు, భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 సక్సెస్ అంతరిక్షంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోందన్నారు. మానవాళి మనుగడ కోసం విశ్వంపై శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతాయని ట్వీట్ చేశారు.
అంతరిక్ష నౌక తన గమ్యాన్ని చేరుకోవడానికి 125 రోజుల సమయం పడుతుంది. ఆదిత్య L1 భూమి, సూర్యుని మధ్య లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) వద్ద నిలుపుతారు. భూమి నుంచి దాని దూరం 1.5 మిలియన్ కిలోమీటర్లు. ఇక్కడికి చేరితే ఒక వస్తువు ఇంధనం అవసరం లేకుండా కక్ష్యలో అలా స్థిరంగా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దానిపై రెండు ఖగోళ వస్తువుల నుంచి వ్యతిరేక దిశల్లో సమాన బలం పని చేస్తుంది. అందుకే ఇక్కడి నుంచి సూర్యుడి ఫొటోలు తీయడానికి వీలవుతుంది.
మరోవైపు సూర్యుడిపై ఆదిత్య ఎల్1 ల్యాండ్ అవుతుందా..? అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి. చంద్రుడిపై చంద్రయాన్-3 ని ల్యాండ్ చేసినట్లుగా ఆదిత్య-L1ని కూడా సూర్యుడిపై ల్యాండ్ చేస్తారా..? అని అడుగుతున్నారు. అయితే సూర్యుడిపై ల్యాండింగ్ అంటూ ఉండబోదు. గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. అదో వాయుగోళం. సూర్యుడి బయటి పొర కరోనాలోకి రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు. ప్రస్తుతం నాసాకు చెందిన ప్రోబ్ అనే రాకెట్ ప్రవేశించి పరిశోధనలు చేస్తోంది.
నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఆదిత్య-L1 మిషన్‌లో ఏడు పేలోడ్‌లో కీలకంగా పనిచేయనున్నాయి. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడి లోపల పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలపై శోధిస్తాయి.
Also Read: Jailer Movie: ఓటీటీలో విడుదల కానున్న జైలర్ సినిమా, ఎప్పుడు ఎందులోనంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook