Delhi Excise Policy Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడి అధికారులకు రూ. 5 కోట్ల లంచం.. సీబీఐ కేసు నమోదు

Delhi Excise Policy Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుని ప్రభావితం చేసేందుకు సీనియర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్టుగా దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. తన హోదాను అడ్డం పెట్టుకుని ఈ కేసు విచారణలో లిక్కర్ వ్యాపారి అమన్ దీప్ ధల్ పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ. 5 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాల కింద ఈడీ ఉన్నతాధికారిపై సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.

Written by - Pavan | Last Updated : Aug 29, 2023, 06:35 PM IST
Delhi Excise Policy Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడి అధికారులకు రూ. 5 కోట్ల లంచం.. సీబీఐ కేసు నమోదు

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమన్ దీప్ ధల్ అనే లిక్కర్ వ్యాపారిపై చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం అతడి వద్ద నుంచి రూ. 5 కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తోన్న పవన్ ఖత్రిపై సీబీఐ కేసు నమోదు చేసింది. పవన్ ఖత్రి ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లో అసిస్టింట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. తన హోదాను అడ్డం పెట్టుకుని ఈ కేసు విచారణలో లిక్కర్ వ్యాపారి అమన్ దీప్ ధల్ పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ. 5 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాల కింద ఈడీ ఉన్నతాధికారిపై సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అసిస్టింట్ డైరెక్టర్ పవన్ ఖత్రి, అమన్ దీప్ ధల్ పేర్లు మాత్రమే కాకుండా ఎయిర్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దీపక్ సంగ్వాన్, క్లారిడ్జెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సీఈఓ విక్రమాదిత్య, చార్టర్డ్ అకౌంటెంట్ ప్రవీణ్ కుమార్ వత్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగంలో క్లర్క్ నితేష్ కోహర్, అమన్ దీప్ ధల్ తండ్రి బీరేందర్ పాల్ సింగ్ పేర్లను కూడా సీబీఐ తమ ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించింది.

కేసు నమోదు చేసిన అనంతరం నిందితులకు సంబంధించిన మొత్తం 6 ప్రదేశాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అసిస్టింట్ డైరెక్టర్ పవన్ ఖత్రి కానీ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగంలో క్లర్క్ నితేష్ కోహర్ కి కానీ ఈ కేసు దర్యాప్తుతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. వారి ఇళ్లలో, కార్యాలయాల్లో సీబీఐ జరిపిన సోదాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించిన డాక్యుమెంట్స్ లభించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుతో సంబంధం లేనప్పటికీ.. ఈ ఇద్దరి వద్ద ఆ కేసుకి సంబంధించిన దస్త్రాలు, ఇతరత్రాలు లభించడం సీబీఐ నమోదు చేసిన కేసుకు మరింత బలాన్నిచ్చినట్టయింది.

ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికరమైన మరో అంశం ఏంటంటే.. ఈ కేసులో సీబీఐకి ఫిర్యాదు ఇచ్చింది మరెవరో కాదు... లిక్కర్ వ్యాపారి అయిన తన కుమారుడు అమన్ దీప్ ధల్ ని ఈ కేసులోంచి బయటపడేయాల్సిందిగా కోరుతూ అతడి తండ్రి బీరేంద్ర పాల్ సింగ్ డిసెంబర్ 2022 నుండి వివిధ దఫాల్లో రూ. 5 కోట్ల వరకు పై వ్యక్తులకు లంచం ఇచ్చినట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులే సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఫిర్యాదు ఆధారంగా నేరపూరితమైన కుట్రకు పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 120B, అలాగే అవినీతి నిరోధక చట్టం కింద ఈ కేసు నమోదు చేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుని ప్రభావితం చేసేందుకు సీనియర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్టుగా దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇటీవల కాలంలో తెరమరుగైనట్టుగా అనిపించినప్పటికీ.. ఢిల్లీ సర్కారుతో పాటు మన తెలుగు రాష్ట్రాల నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ప్రముఖ వ్యాపారి శరత్ చంద్రా రెడ్డి వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించిన ఈ కేసు తాజా పరిణామంతో మరోసారి వార్తల్లోకెక్కింది. దీంతో ఎన్నికలకు ముందు వారిని ఎండగట్టడానికి వారి రాజకీయ ప్రత్యర్థులకు మరో ఆయుధం లభించినట్టయింది.

Trending News