రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్‌లో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన స్థలంలోనే హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
అటు కామినేని ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత హరికృష్ణ భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని నివాసానికి తరలించనున్నారు. అంతకుముందు ప్రమాద వార్త తెలియగానే హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, దగ్గుబాటి పురందరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, సినీనటుడు జగపతి బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ తదితరులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.