What Is Sharenting, what is Online Kidnapping : షేరెంటింగ్... అసలు ఈ షేరెంటింగ్ అంటే ఏంటో తెలుసా ? వాస్తవానికి దాదాపు 13 సంవత్సరాల క్రితం.. అంటే 2010లో... ఇంకా చెప్పాలంటే.. సోషల్ మీడియా వినియోగం ప్రాచుర్యంలోకి వచ్చిన కొత్తలోనే ఈ ' షేరెంటింగ్ ' అనే పదం వాడుకలోకి వచ్చింది. తాజాగా అస్సాం పోలీసుల పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ షేరెంటింగ్ ట్రెండ్ అవుతోంది. షేరెంటింగ్ అంటే.. పిల్లల ఫోటోలు, వీడియోలను వారి తల్లిదండ్రులు లేదా పెద్దలు వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకోవడమే అన్నమాట. చాలామంది పేరెంట్స్‌కి తమ పిల్లల ఫోటోలు, వీడియోలను వాట్సాప్ డీపీలుగానో లేక వాట్సాప్ స్టేటస్‌లుగా షేర్ చేసుకునే అలవాటు ఉంటుంది. ఇది కూడా షేరెంటింగ్ కిందకే వస్తుంది.
షేరెంటింగ్ గురించి పేరెంట్స్‌ని హెచ్చరించిన అస్సాం పోలీసులు
డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, లేదా సోషల్ మీడియాలో తమ పిల్లలకు సంబంధించిన కీలకమైన లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకునే తల్లిదండ్రులు వారికి తెలియకుండానే షేరెంటింగ్‌కి పాల్పడుతున్నట్టు లెక్క. ఇది ఎలాంటి డేంజర్స్కి దారి తీస్తుందో చెప్పాలంటే ముందుగా మీకొక ఉదాహరణ చెప్పాలి.
ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చి మీ పిల్లల ఫోటోలు, వీడియోలు లేదా ఇతర సున్నితమైన సమాచారం గురించి అడిగితే మీరు చెబుతారా ? వాళ్లు అడిగిన వివరాలు ఇస్తారా ? అస్సలే ఇవ్వరు కదా.. ఎందుకంటే వారు అలా ఎందుకు అడుగుతున్నారో ఏమో.. వారు తమ పిల్లలకు సంబంధించిన సమాచారంతో పిల్లలకు ఏదైనా హాని తలపెడతారేమో అంటూ రకరకాల ఆలోచనలు మిమ్మల్ని అభద్రతా భావానికి గురి చేస్తాయి కదా.. కానీ మీకు మీరే మీ పిల్లల ఫోటోలు, వీడియోలు, ఇతర సమాచారం సోషల్ మీడియాలో పెడితే.. ఆ సమాచారాన్ని తమ అవసరంగా మల్చుకునే దురుద్దేశం ఉన్న అసాంఘీక శక్తులకు మీరు మీ పిల్లల డేటా ఇచ్చినట్టే కదా మరి. ఇప్పుడు ఆలోచించి చూడండి.. మీరు ఏం చేస్తున్నారో, ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో అనేది అర్థం అవుతుంది. ఇదే విషయాన్ని అస్సాం పోలీసులు హైలైట్ చేస్తూ తల్లిదండ్రులను షేరెంటింగ్‌కి దూరంగా ఉండమని అప్రమత్తం చేస్తున్నారు.
పిల్లలకు సంబంధించిన సున్నితమైన డేటాను సోషల్ మీడియాలో పంచుకోవడం వల్ల వారి వ్యక్తిగత వివరాలను మీరు నెటిజెన్స్ అందరికీ అందుబాటులో పెట్టినట్టే అవుతుంది అనే విషయాన్ని గుర్తించండి. ఇది మీరంటే పడని వారికి, మీ శత్రువులకు ఆయుధం ఇచ్చినట్టే అవుతుంది అనే విషయాన్ని గుర్తించండి. ఇది డిజిటల్ కిడ్నాపింగ్, సైబర్ బెదిరింపులకు సైతం దారి తీస్తుంది. మీకు తెలియకుండా మీ పిల్లలను మీరే ప్రమాదంలో పడేసినట్టవుతుంది.
మీరు అప్లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలను మీరు డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే వాటిని అవసరంగా మల్చుకుందాం అనుకునే వారు ఒకవేళ వాటిని స్క్రీన్‌షాట్ తీసి భద్రపర్చుకుంటే ఏం చేస్తారో చెప్పండి అని పేరెంట్స్‌కి అవగాహన కల్పిస్తున్నారు.
తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో కొన్ని ఫోటోలను రూపొందించిన అస్సాం పోలీసులు.. " ఇలా మీ పిల్లలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడం ఆపేయండి " అని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
షేరెంటింగ్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులు
షేరెంటింగ్ వల్ల మీ పిల్లల గోప్యతను మీరే లీక్ చేసిన వారు అవుతారు. షేరెంటింగ్ అనేది వారిని ఎప్పుడైనా ప్రమాదంలో పడేయొచ్చు. చాలా కాలం గడిచిన తర్వాత కూడా సోషల్ మీడియా యూజర్స్ మీ పిల్లల ఫోటోలు, వీడియోలు ఆధారంగా వారిని అవమానించడం, వెక్కిరించడం లేదా వేధింపులకు పాల్పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు షేరెంటింగ్ గురించి బాగా తెలిసిన ఎక్స్పర్ట్స్.
ఇంతటితో అయిపోలేదు.. భవిష్యత్తులో ఎప్పుడైనా సమస్యే..
మీరు ఇప్పుడు పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు వారిని భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఇక డిజిటల్ కిడ్నాప్ లేదా ఆన్లైన్ కిడ్నాప్ అంటే ఏంటంటే.. సోషల్ మీడియా నుండి సేకరించిన పిల్లల ఫోటోను ఉపయోగించి ఒక కొత్త గుర్తింపునే తయారు చేసే కుట్రనే డిజిటల్ కిడ్నాప్ అంటారు. అంటే మీకే తెలియకుండా మీ పిల్లల వివరాలను ఇంకెవరో వారి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం అన్నమాట. ఇదంతా పక్కనపెడితే.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు ఆధారంగా పిల్లలను గుర్తించి వారిని నిజంగానే భౌతికంగానే కిడ్నాప్ చేసిన ఉదంతాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు చెప్పండి షేరెంటింగ్తో లాభమా నష్టమా ?