Gas Leakage at Odisha Tata Steel Plant: ఒడిషా స్టీల్ ప్లాంట్‌లో డేంజరస్ గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో 19 మంది వరకు తీవ్రంగా గాయపడినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఒడిషా లోని దెంకనల్ జిల్లా మెరమండలి వద్ద ఉన్న టాటా స్టీల్ కర్మాగారంలో మంగళవారంస ఈ ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పరిశ్రమలో గ్యాస్ లీక్ అవడంతో స్టీమ్ పైప్ పేలిపోయింది. పైప్ పేలిపోయిన తరువాతే కార్మికులకు, ఇంజనీర్లకు తీవ్ర గాయాలైనట్టుగా ఒడిషా బైట్స్ అనే మీడియా సంస్థ పేర్కొంది. స్టీమ్ పైప్ పేలిపోవడంతో అందులో ఉన్న వేడి నీరు అక్కడే ఉన్న కార్మికులు, ఇంజనీర్ల మీద పడింది. ఈ కారణంగానే ప్రమాదం తీవ్రత మరింత పెరిగిందని.. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అని ఒడిషా బైట్స్ వార్తా కథనం పేర్కొంది.
దెంకనాల్ జిల్లా ఎస్పీ జ్ఞానరంజన్ మహాపాత్రో స్పందిస్తూ.. ఈ ఘటనలో మొత్తం 19 మందికి గాయాలయ్యాయి అని అన్నారు. జిల్లా అధికర యంత్రాంగం సైతం దర్యాప్తు కోసం ఘటనా స్థలానికి వెళ్తున్నట్టు తెలిపారు.
మధ్యాహ్నం 1 గంటకు స్టీమ్ పైప్ వద్ద ఇన్ స్పెక్షన్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. పైప్ ఇన్ స్పెక్షన్ వద్ద ఉన్న సిబ్బందిపైనే ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా కనిపించింది. తీవ్రంగా గాయపడిన వారిని తొలుత పరిశ్రమ ఆవరణలోని ఆస్పత్రిలోనే ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం టాటా కంపెనీకి చెందిన అంబులెన్సులో కటక్‌కి పంపించినట్టు కంపెనీ తమ తాజా ప్రకటనలో పేర్కొంది.