ఇంగ్లాండ్‌లో టీమిండియా ఆడుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా హర్భజన్ సింగ్, సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్‌తో తీసుకున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో లార్డ్స్ మైదానం బయట అర్జున్ టెండుల్కర్ రేడియోలు అమ్ముతూ కనిపించడం విశేషం. అసలు విషయానికి వస్తే.. అర్జున్ గతకొంత కాలంగా లార్డ్స్‌లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. అలా అక్కడ శిక్షణ పొందే కుర్రాళ్లు మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో క్లబ్బు చెప్పే కొన్ని అదనపు పనులు కూడా చేస్తుంటారు.
పిచ్ విషయంలో గ్రౌండ్ సిబ్బందికి సహాయం చేయడం, ప్రేక్షకుల టిక్కెట్లు చెక్ చేయడం లాంటివి అన్నమాట. అలాంటి పనుల్లో భాగంగానే క్లబ్ తనకు ఇచ్చిన టాస్క్‌లో భాగంగా.. మైదానం బయట ప్రేక్షకులకు రేడియోలు అమ్మే పని కూడా చేశాడట అర్జున్. ప్రేక్షకులు మ్యాచ్‌ను చూస్తూ.. కామెంటరీ వినేందుకు ఈ డిజిటల్ రేడియోలు ఉపయోగపడతాయి. అయితే అర్జున్ను రేడియోలు అమ్మే కుర్రాడిగా చూడడంతో తొలుత హర్భజన్ సింగ్ ఆశ్చర్యపోయాడట. ఆ తర్వాత.. డిగ్నిటీ ఆఫ్ ల్యాబర్ అంటే ఇదేనని మెచ్చుకున్నాడట.
"అర్జున్ నాకు డిజిటల్ రేడియోలు అమ్ముతూ నా కంటపడ్డాడు. ఇప్పటి వరకూ 50 రేడియోలు అమ్మాడట. ఇంకా కొన్ని మాత్రమే మిగిలున్నాయట. గుడ్ బాయ్" అని హర్భజన్ ట్వీట్ కూడా చేశాడు. ఆ ట్వీట్‌తో పాటు తాను అర్జున్‌తో కలిసి తీసుకున్న ఫోటో కూడా పోస్టు చేశాడు. గత నెల భారత అండర్-19 జట్టుతో కలిసి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన అర్జున్ అక్కడ ఎంసీసీ జట్టులోని యువ క్రికెటర్లతో కలిసి సాధన చేస్తున్నాడు. అక్కడే వారితో కలిసి ఎంసీసీ వారి హాస్టలులోనే ఉంటున్నాడు.
Look who selling radios @HomeOfCricket today.. sold 50 rush guys only few left 😜 junior @sachin_rt #Goodboy pic.twitter.com/8TD2Rv6G1V
— Harbhajan Turbanator (@harbhajan_singh) August 11, 2018