స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 32కోట్ల జన్ ధన్ ఖాతాదారులకు తీపి కబురు అందించనున్నారు. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాదారులకు రూ.1 లక్ష వరకు ఓవర్ డ్రాఫ్ట్, రూ.1 లక్షకుపైగా మైక్రో ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కేంద్రం ఇవ్వనుంది. ప్రధాని మోదీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ విషయం వెల్లడిస్తారని అధికార వర్గాల సమాచారం.
దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను చేరవేయాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఆగస్టులో జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాల్లో 32.25 కోట్ల ఖాతాలు తెరవబడగా పీఎంజేడీవై-II ఆగస్టు 15తో ముగియనుంది.
ఖాతాదారులకు ఉచితంగా బీమా
ఆగస్టు 15 నుంచి పది కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా అందించాలని కేంద్రం యోచిస్తోంది. పంద్రాగస్టు రోజున మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. అయితే, ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు విధివిధానాలు వెల్లడి కాలేదు. జన్ ధన్ ఖాతాలతో ఈ పథకానికి సంబంధం ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది .ప్రస్తుతం అమల్లో ఉన్న సురక్ష పాలసీని జన్ ధన్ ఖాతాదారులకు అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా ఏడాదికి కేవలం రూ. 12 ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పాలసీని అందిస్తోంది.
అటు ఇప్పటివరకు ఉన్న రూ.5వేలు ఉన్న అటల్ పెన్షన్ యోజన గరిష్ట శ్లాబ్ ను రూ.10వేలకు పెంచుతున్నట్లు ప్రకటించనున్నారు.
అటల్ పెన్షన్ యోజన
చెల్లించే చందాను బట్టి పింఛను 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు వస్తుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి 60వ ఏట నుంచి నెలకు 1,000 రూపాయల పింఛను్ కోరుకుంటే ప్రతి నెలా 42 రూపాయల చొప్పున 42 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి 2వేల పింఛను్ కావాలనుకుంటే.. ప్రతి నెలా 84 రూపాయలు, 3వేల పింఛను్ కోరుకుంటే 126 రూపాయలు, 4వేల పింఛను్ కోరుకుంటే 168 రూపాయలు, 5వేల పింఛను్ కోరుకుంటే నెలనెలా 210 రూపాయలు చందా చెల్లించాలి.
జన్ ధన్ ఖాతాదారులకు మోదీ తీపి కబురు