అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేంద్ర మంత్రి

కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రాజన్ గోహేన్ అత్యాచార కేసులో ఇరుక్కున్నారు.

Last Updated : Aug 11, 2018, 08:04 AM IST
అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేంద్ర మంత్రి

కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రాజన్ గోహేన్ అత్యాచార కేసులో ఇరుక్కున్నారు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తమను లోబరుచుకున్నట్లు ఇద్దరు మహిళలు అస్సాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల ఆశ చూపి గత ఏడెనిమిది నెలలుగా కేంద్ర మంత్రి లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. తర్వాత ఉద్యోగాల కోసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, ఇంటికి వెళ్తే లోపలి అనుమతించడం లేదని బాధితులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మంత్రి తమతో మాట్లాడిన టెలిఫోనిక్ సంభాషణల క్లిప్స్ తమవద్ద ఉన్నాయని బాధితులు చెప్పారు.

కేంద్రమంత్రి రాజన్ గోహేన్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నాగావ్ జిల్లా డియోరిజాన్‌కు చెందిన ఇద్దరు అక్కాచెళ్లెళ్లు కేంద్ర రైల్వే సహాయమంత్రిపై ఫిర్యాదు చేశారని.. ఆగస్టు 2న తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని జిల్లా ఎస్పీ పోలీసు సూపరింటెండెంట్ శంకర్ బి. రైమిడి ఓ వార్తా పత్రికకు తెలిపారు.

కేంద్రమంత్రిపై అత్యాచార కేసు నమోదైన తర్వాత ఆయన్ను కేంద్రమంత్రిగా ఎలా కొనసాగిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సదరు మంత్రిని వెంటనే మంత్రిపదవి నుంచి డిస్మిస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 'ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాజన్ గోహేన్‌ను వెంటనే మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలి' అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా డిమాండ్ చేశారు.

గతంలో కేంద్ర మంత్రి రాజన్‌ గోహేన్‌.. ఓ కార్యక్రమంలో వృద్ధుడితో దురుసుగా వ్యవహరించిన తీరు గురించి తెలిసిందే. తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టిన రిటైర్డ్ టీచర్ పట్ల కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది.

Trending News