The Story of a Beautiful Girl Review: ఈ మధ్యకాలంలో ఆసక్తికరమైన కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అలా ఒక ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్'. ఛార్మితో `మంత్ర`, అనుపమా పరమేశ్వరన్‌తో `బట్టర్ ఫ్లై` వంటి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను తీస్తూ వార్తల్లోకి ఎక్కిన జెన్ నెక్ట్స్ ప్రొడక్షన్ ఇప్పుడు అలాంటి కంటెంట్‌తో `ఏ స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్` సినిమాని నిర్మించింది. రవి ప్రకాష్ బోడపాటి దర్శకత్వంలో ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు సంయుక్తంగా నిర్మించగా హీరో నిహాల్ కోదాటి, దృషికా చందర్ హీరోయిన్ గా నటించారు. మధునందన్, భార్గవ పోలుదాసు, జర్నలిస్ట్ దేవి నాగవల్లి ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూ లో చూద్దాం.
సినిమా కథ ఏమిటంటే
ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని గడిపే రవి(నిహాల్ కోదాటి), చరిత్ర(దృశిక చందర్) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు చిన్ననాటి నుంచి కలిసే పెరగడంతో వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ పీక్స్ లో ఉండగా ఒకరోజు ఆమె మిస్ అవుతుంది. తల్లి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసుని క్రైమ్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని ఆమెను కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. చరిత్ర మిస్సింగ్‌కి సంబంధించి క్లూస్ రాబట్టే క్రమంలో ఆమెతో టచ్‌లో ఉన్న వారిని విచారిస్తున్న పోలీసులు రవి స్నేహితుడు, ఒక బిగ్ షాట్ హెడ్ విక్రమ్(సమర్థ్ యుగ్)ని మొదటగా విచారించినా ఏమీ తేలక పోవడంతో చరిత్రతో క్లోజ్‌గా ఉన్న రవిని విచారించగా, తమ మధ్య ఉన్న లవ్ స్టోరీ బయటకు వస్తుంది. ఈ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చిన అరవింద్(భార్గవ) కేసును సీరియస్గా తీసుకుని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడు. చివరికి చరిత్ర ఏమైందో పోలీసులు తెలుసుకున్నారా? చరిత్ర న్యాయం కావడం వెనుక విక్రం ఉన్నాడా లేక రవి ఉన్నాడా? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read: Ustaad Bhagat Singh: ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్దంటున్న ఉస్తాద్ భగత్ సింగ్
విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాల మీద ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ రవి. సినిమా ఓపెనింగ్ లోనే చరిత్ర మిస్సయినట్లుగా చూపించి అసలు ఆమె ఎవరు? ఆమె ఎందుకు మిస్ అయిందనే విషయాలు రివీల్ చేస్తూ సినిమాలోకి నెమ్మదిగా తీసుకువెళ్లాడు. ఫస్ట్ ఆఫ్ అంతా పాత్రల పరిచయం కోసమే వాడేసుకున్న దర్శకుడు ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం కాస్త ఆసక్తికరంగా మలిచాడు. తర్వాత సెకండ్ హాఫ్ లో పూర్తిస్థాయిలో కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన దర్శకుడు అసలు చరిత్రకు ఏం జరిగింది? చరిత్ర లాంటి మరికొంతమంది అమ్మాయిలు మాయం కావడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? అనే విషయాన్ని ఆసక్తికరంగా రివీల్ చేస్తాడు. పూర్తిస్థాయిలో సినిమా ఎగ్జయిట్ చేస్తుందని చెప్పలేం కానీ సినిమా చూస్తున్నంత సేపు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు.
నటీనటుల విషయానికి వస్తే
ఈ సినిమాల్లో లీడ్ రోల్ లో నటించిన నిహాల్ కోదాటి తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో పూర్తిస్థాయిలో జీవించేశాడు. ఇక చరిత్ర అనే మిడిల్ క్లాస్ నుంచి అప్పుడప్పుడే డబ్బు సంపాదించి పైకి ఎదిగిన అమ్మాయి పాత్రలో దృశికా చందర్ కూడా ఆకట్టుకునేలా నటించింది. ఇక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటించిన భార్గవ పోలుదాసు ఎక్కడ తగ్గకుండా తనదైన శైలిలో నటించాడు. ఇక మధు నందన్ దేవీ నాగవల్లి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే
చిన్న సినిమా అయినా చాలా క్వాలిటీతో ఉంది సినిమా. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. ఆ విషయంలో జెన్ నెక్ట్స్ ప్రొడక్షన్‌ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. గిడియన్ కట్టా సంగీతం, పాటలు ఆకట్టుకున్నాయి. అమర్ దీప్ గుత్తుల కెమెరా పనితనం కనిపించింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ టేబుల్ మీద మరికొంత కత్తెరకు పని చెప్పాల్సింది. దర్శకుడు రవి ప్రకాష్ దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే నెరేషన్ నిదానంగా అనిపిస్తుంది. ఆ స్పీడ్ పెంచితే వేరే లెవల్లో ఉండేది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, ఆయా సన్నివేశాలను మరింత గ్రిప్పింగ్ గా రాసుకుని ఎంటర్‌టైన్‌మెంట్ జోడిస్తే సినిమా ఫలితం వేరే రేంజ్ లో ఉండేది.
సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు, మంచి మెసేజ్ కోరుకునేవాళ్లు తప్పక చూడాల్సిన సినిమా ఇది.
Rating: 2.75/5
Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!