రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లా ప్రాంతానికి చెందిన మియా కా బారా అనే ఊరిలో గ్రామస్తులు ఓ వింత సమస్యని మున్సిపాలిటీ దృష్టికి తీసుకొచ్చారు. తమ ఊరి పేరు "మియా కా బారా" అని ఉండడం వల్ల ఆ ఊరిలో అత్యధిక శాతం మంది ముస్లిములు ఉంటారన్న ఉద్దేశంతో.. తమ ఊరి అమ్మాయిలను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని.. అందుకే ఊరి పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ వారు కూడా స్థానికుల డిమాండ్ మేరకు, ప్రభుత్వ సిఫార్సు మేరకు ఆ ఊరి పేరును మహేష్ నగర్‌గా మార్చారు.
దానికి కూడా గ్రామస్తులు పలు కారణాలు తెలిపారు. ఆ ఊరిలో అత్యధిక శాతంమంది హిందువులే ఉన్నారని.. ముస్లిం కుటుంబాలు చాలా తక్కువని.. అందుకే శివుడి పేరు కలిసొచ్చేలా మహేష్ నగర్ అనే పేరును తాము సిఫార్సు చేశామని తెలిపారు. అనేక సంవత్సరాల క్రితం కూడా ఆ ఊరిని మహేష్ బరా అని పిలిచేవారని.. అయితే అనేక ఇతర మతస్తులు కొన్ని రోజులు అదే ఊరికి వలస వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకోవడం వల్ల మహేష్ బరా అనేది.. మియా కా బరాగా మారిందని తెలిపారు.
ఈ మధ్యకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో స్థానికుల డిమాండ్ మేరకు ఊరి పేర్లను మార్చడం అనేది రెగ్యులర్‌గా జరుగుతోంది. ఉదాహరణకు ఇటీవలే యూపీలోని మొఘల్ సరాయ్ రైల్వేస్టేషను పేరును దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షనుగా మార్చారు. అలాగే రాజస్థాన్‌లోని జున్జును జిల్లాకి చెందిన ఇస్మాయిల్ పుర్ ఊరి పేరును కూడా పిచన్వా ఖుర్ధ్ పేరుతో పిలవడం ప్రారంభించారు. జాలోర్ జిల్లాలోని నర్పరా ఊరి పేరును నరపురగా మార్చారు. హోంశాఖకు కూడా ఈ సంవత్సరం తమ ఊరి పేర్లు మార్చాలని దాదాపు 27 ప్రపోజల్స్ వచ్చాయట.