Prema Deshapu Yuvarani: ప్రేమదేశపు యువరాణి మూవీ రివ్యూ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే..?

Prema Deshapu Yuvarani Movie Review: డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ప్రేమదేశపు యువరాణి చిత్రం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సాయి సునీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2023, 09:29 PM IST
Prema Deshapu Yuvarani: ప్రేమదేశపు యువరాణి మూవీ రివ్యూ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే..?

Prema Deshapu Yuvarani Movie Review: ఏజీఈ క్రియేషన్స్‌ ఎస్‌2మెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై  యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘ప్రేమదేశపు యువరాణి’. ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సీహెచ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.

కథ ఏంటంటే..?

అమలాపురంలో వీరయ్య అనే రౌడీ షీటర్ చాలామంది ప్రజలను ఇబ్బంది పెడుతూ ఎదురు తిరిగిన వారిని, వారి కుటుంబాన్ని మర్డర్స్ చేస్తూ.. నచ్చిన అమ్మాయిలను మానభంగం చేస్తూ వీరంగం చేస్తుంటాడు. అయితే అదే ఊర్లో  బీటెక్ పూర్తి చేయలేక  ఏడు సబ్జెక్టులలో  ఫెయిల్ అయ్యి తండ్రితో తిట్లు తింటూ  ఎటువంటి గోల్స్ లేక ఫ్రెండ్స్‌తో తాగుతూ జూలాయిగా తిరుగుతున్న చెర్రీ (యామిన్‌ రాజ్‌)కు శ్రావణి (ప్రియాంక రేవ్రి) కనిపిస్తుంది. ఆమెను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె తన ప్రేమదేశపు యువరాణి అని ఫిక్స్ అవుతాడు. తనకు తెలియని ఇంత అందగత్తె ఈ ఊర్లో ఎవరని ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటాడు. రావులపాలెం నుంచి ఉద్యోగ రీత్యా శ్రావణి కుటుంబం అమలాపురానికి వచ్చిందని  శ్రావణి తండ్రి, చెర్రీ తండ్రి ఇద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. 

ఆ తరువాత శ్రావణితో మాటలు కలవడంతో తను ఫెయిల్ అయిన 7 సబ్జెక్ట్స్‌కు ట్యూషన్ చెప్పి హెల్ప్ చేస్తానంటుంది. అలా మొదలైన పరిచయంతో శ్రావణిపై చెర్రీకి మరింత ప్రేమ పెరుగుతుంది. చివరకు పెళ్లి చేసుకుందామని చెర్రీ అడగ్గా.. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను.. కలెక్టర్‌తో పాటు తనకు చాలా గోల్స్ ఉన్నాయని పెళ్లి  చేసుకొనని చెబుతుంది. పెళ్లి ఎందుకు వద్దంటున్నావ్ అని నిలదీయగా.. రవి (విరాట్‌ కార్తిక్‌)ను ఇష్టపడ్డానని చెబుతుంది. దీంతో షాక్ అయిన చెర్రీ శ్రావణి ప్రేమను దక్కించుకోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.

మరోవైపు అదే ఊరి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా  మర్డర్స్ జరుగుతుంటాయి. ఈ హత్యలు అన్ని కూడా డిఫరెంట్ వెపన్స్‌తో  చేస్తుంటారు. రౌడీ షీటర్ వీరయ్య మనుషులు చనిపోతూ ఉంటారు. ఈ మర్డర్స్ గురించి ఎంక్వయిరీ చేయిస్తున్న ఎస్‌ఐ శంకర్ ఇవన్నీ  ఒక అమ్మాయి రూపంలో ఉండే భద్ర కాళీ చేస్తుందని తెలుసుకొని షాక్ అవుతాడు. ఈ హత్యల వెనుక ఉన్న రహస్యం ఏంటి..? అనే తెలుసుకుంటుండగానే రౌడీ షీటర్ వీరయ్యతో పాటు తన కొడుకు భైరవ్‌లు కూడా హత్యకు గురవుతారు. ఈ హత్యల వెనుక ఉన్న భద్ర కాళీ  ఎవరు..? ఈ హత్యలు ఎందుకు చేస్తుంది..? అసలు ఈ రవి ఎవరు..? తనకు శ్రావణి ఎందుకు దూరంగా ఉంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న తను కలెక్టర్ అవుతుందా..? చివరకు శ్రావణి చెర్రీకు దగ్గరైందా..? లేక రవికి దగ్గరైందా..? అనే ట్విస్ట్‌ ఏంటనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా  "ప్రేమదేశపు యువరాణి" సినిమాను తెరపై చూడాల్సిందే..

ఎవరు ఎలా నటించారంటే..?

చెర్రీ పాత్రలో నటించిన (యామిన్‌ రాజ్‌) తన హావభావాలతో పాటు, మాటలు, పాటలు, ఫైట్స్, ఎమోషన్స్ ఇలా అన్ని షేడ్స్‌ను చక్కగా పండించాడు. శ్రావణి పాత్రలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక రేవ్రి తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయింది. తన నటనతో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసి మరో మెట్టుపైకి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. రవి పాత్రలో లెక్చరర్‌గా నటించిన విరాట్‌ కార్తిక్‌ అటు లెక్చరర్‌గా ఇటు ఉరి జనాలకు ఏ కష్టం వచ్చినా ముందుండే పాత్రలో చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోకు ఫ్రెండ్స్‌గా నటించిన  మెహబూబ్‌ బాషా, బండ సాయి, బక్క సాయి  నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీరయ్య పాత్రలో  సందీప్‌ క్రూరమైన విలన్‌గా  చాలా చక్కగా నటించాడు. తన కొడుకుగా  భైరవ్ పాత్రలో పవన్ కూడా బాగా నటించాడు. హీరో  తల్లిదండ్రులుగా హరికృష్ణ, సునీత మనోహర్‌ నటన బాగుంది.  

సాంకేతిక నిపుణుల పనితీరు

డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఎమోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్ట్‌ను  ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ లాంటి ఆసక్తికర సన్నివేశాలతో చక్కని కథను రాసుకొని సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలతో నీట్ అండ్ క్లీన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందించడంలో దర్శకుడు సాయి సునీల్‌ నిమ్మల సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అజయ్‌ పట్నాయక్‌ అద్భుతమైన సంగీతం అందించారు. సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. ఆర్‌పీ పట్నాయక్‌, సునీత పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. శివకుమార్‌ దేవరకొండ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎం.ఆర్‌. వర్మ ఎడిటింగ్ పనితీరు, నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘ప్రేమదేశపు యువరాణి’ అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా.. థియేటర్‌కు వచ్చిన ప్రతి ఆడియన్ మంచి ఫీల్‌తో బయటకు వస్తారు. 

రేటింగ్: 2.75
 

Trending News