భారత్‌లో అనాథ బిడ్డ.. స్విట్జర్లాండ్‌లో అధినేత

2017 నవంబరులో ఎవాంజలికల్ పీపుల్స్ పార్టీ అనే మైనారటీ పార్టీ తరఫున మళ్లీ ఎన్నికల్లో నిలబడి స్విట్జర్లాండ్ పార్లమెంట్‌కి ఎంపికయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా కూడా రికార్డు సాధించాడు

Last Updated : Jan 20, 2018, 02:00 PM IST
భారత్‌లో అనాథ బిడ్డ..  స్విట్జర్లాండ్‌లో అధినేత

40 సంవత్సరాల క్రితం ఓ బాలుడు కర్ణాటకలోని ఉడుపి ప్రాంతంలో ఒక పేదింటి మహిళకు జన్మించాడు. అయితే ఆ బిడ్డను పోషించే స్థితిలో ఆమె లేకపోవడంతో ఓ చర్చి ఫాదర్‌కి ఆ బాలుడిని దత్తతకు ఇచ్చేసింది. కొన్నాళ్ళ తర్వాత స్విట్జర్లాండ్‌కి చెందిన ఓ జంట ఆ బాలుడిని ఆ చర్చి ఫాదర్ దగ్గర నుండీ మళ్లీ దత్తతకు తీసుకున్నారు. తనకు నిక్లాస్ శామ్యూల్ గగ్గర్ అనే పేరు పెట్టారు.

అయితే ఆ జంట కొంతకాలం తర్వాత వ్యాపారనష్టాలను చవిచూడడంతో.. తమతో పాటు ఆ కుర్రాడిని కూడా పనికి తీసుకెళ్లేవారు. అలా తన పెంపుడు తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తూ.. పలు వృత్తి విద్యలు కూడా నేర్చుకున్నాడు నిక్లాస్. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు భారం తగ్గించడం కోసం ట్రక్కు డ్రైవరుగా, మెకానిక్‌గా, తోటమాలిగా కూడా పనిచేశాడు. 

అలా పనిచేస్తూనే తన డబ్బులతో తాను చదువుకుంటూ సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవాడు నిక్లాస్. అతని వాలంటీర్‌షిప్ నచ్చి స్థానిక నేత ఒకరు నిక్లాస్‌ను జర్మన్ బోర్డర్‌కి దగ్గరలో ఉన్న వింటర్‌తర్ సిటీకి టౌన్ కౌన్సిలర్‌గా పోటీ చేయమని సూచించారు. నిక్లాస్ ఎన్నికల్లో గెలిచి కౌన్సిలర్ అయ్యాక.. అనతికాలంలోనే ప్రజల ప్రేమను చూరగొన్నాడు. మంచి నాయకుడిగా వెలుగొందాడు. 2017 నవంబరులో ఎవాంజలికల్ పీపుల్స్ పార్టీ అనే మైనారటీ పార్టీ తరఫున మళ్లీ ఎన్నికల్లో నిలబడి స్విట్జర్లాండ్ పార్లమెంట్‌కి ఎంపికయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా కూడా రికార్డు సాధించాడు. 

ఈ క్రమంలో నిక్లాస్ మాట్లాడుతూ తన విజయాన్ని భారతదేశంలో తానెవరికైతే జన్మించానో ఆ తల్లికి అంకితమిస్తున్నానని తెలిపాడు. తన దత్తత పత్రాల ద్వారా తన తల్లి పేరు అనసూయ అని తెలుసుకున్నానని... ఆమె తనను సాకలేక పెంపకానికి ఇచ్చినా.. ఆమెంటే తనకు ఎంతో ప్రేమని అంటారు నిక్లాస్. అందుకే తన కూతురికి కూడా అనసూయ అనే పేరు పెట్టానని అంటారాయన. త్వరలోనే తాను ఇండియాకి వస్తానని.. స్టార్టప్స్ ప్రారంభించే యువతకు ప్రోత్సాహం ఇస్తానని తెలిపారు నిక్లాస్. 

Trending News