ఆల్వార్: రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో ఏప్రిల్ 26న చోటుచేసుకున్న ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గాజి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆల్వార్‌కి సమీపంలోని లల్వడి గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై తల్విక్ష్ర గ్రామానికి వెళ్తున్న ఓ జంటను రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి అడ్డగించిన ఐదుగురు యువకులు, వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరు యువకులు ఆమె భర్తను బంధించి హింసిస్తుండగా మరో ముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా తమ పైశాచిక ఆనందాన్ని మొబైల్ కెమెరాలో బంధించిన నిందితులు.. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈ వీడియోను బహిర్గతం చేయడంతోపాటు చంపేస్తామని ఆ జంటను బెదిరించారు. వారి వద్ద నుంచి రూ.10,000 నగదు సైతం లాక్కున్నారు.
ఏప్రిల్ 26న జరిగిన ఈ దుర్ఘటనపై బాధితులు మే 2న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు దారుణం వెలుగులోకొచ్చింది. దీనికితోడు నిందితులు చిత్రీకరించిన వీడియో సైతం వైరల్‌గా మారడం కేసు తీవ్రతను పెంచింది. వీడియో ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్టు అల్వార్ పోలీసులు తెలిపారు. నిందితుల సంభాషణ ఆధారంగా వారిలో ముగ్గురి పేర్లను సచిన్, జితు, అశోక్‌గా గుర్తించినట్టు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్పందించిన బీజేపి ఎంపీ కిరోడి లాల్ మీనా.. నిందితులని తక్షణమే అరెస్ట్ కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌కి ఓ లేఖ రాశారు. అంతేకాకుండా ఈ ఘటనపై అలసత్వం వహించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీ మీనా తన లేఖలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.