Who Will Be Karnataka Next CM: కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. కర్ణాటక సీఎం ఎవరు అవుతారు ?

Who Will Be Karnataka CM If Congress Wins? : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ద్వారాలు తెరుచుకునేలా ఉంటుదని కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివ కుమార్ అన్నారు. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా 141 స్థానాలు గెలుచుకుంటుందని శివ కుమార్ ధీమా వ్యక్తంచేశారు.

Written by - Pavan | Last Updated : Apr 29, 2023, 05:26 PM IST
Who Will Be Karnataka Next CM: కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. కర్ణాటక సీఎం ఎవరు అవుతారు ?

Who Will Be Karnataka CM If Congress Wins? : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఒక ప్రశ్న అయితే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోయేది ఎవరు అనేది మరో సందేహం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపే వారిని కూడా వేధిస్తున్న ప్రశ్న ఇదే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తే.. ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మాజీ సీఎం, కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్యనా లేక కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివకుమార్ అవుతారా అనే ప్రశ్న కర్ణాటక ఓటర్లను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తోంది. 

ఇదే విషయమై తాజాగా పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డికే శివకుమార్ ని ప్రశ్నించగా, ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితం 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ద్వారాలు తెరుచుకునేలా ఉంటుదన్న శివ కుమార్.. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా 141 స్థానాలు గెలుచుకుంటుందని అన్నారు. మే10న జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపికి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే కేంద్రంలోని పెద్దలను అందరినీ దించి మరీ ఎన్నికల ప్రచారం చేపడుతోందన్నారు. మోడీ ఫ్యాక్టర్ దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో పనిచేయదని.. ఇక్కడి ఓటర్లు స్థానిక సమస్యలు, అభివృద్ధికే ఓటేస్తారని ధీమా వ్యక్తంచేశారు. 

కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం కొట్లాటలు లేవని.. సిద్ధరామయ్యకు తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని అన్నారు. ప్రస్తుతం తమ ముందున్న తక్షణ కర్తవ్యం కర్ణాటకలో బీజేపిని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలిచాకా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది అని డికే శివకుమార్ స్పష్టంచేశారు. ఇదిలావుంటే, సరిగ్గా వారం రోజుల కిందటే ఇదే పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ తరపున కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నకు ఇలాంటి సమాధానమే ఇచ్చిన సంగతి తెలిసిందే. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలవం అనే భయం అటు ప్రధాని నరేంద్ర మోదీలో ఇటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి పట్టుకుందని.. క్రితంసారి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదనే భయంతోనే వారు అభద్రతా భావంతో ఉన్నారని డికే శివ కుమార్ ఆరోపించారు.

Trending News