ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ మరియు సిఈఓ చందా కొచ్చర్‌పై దర్యాప్తు సంస్థలు అన్ని విమానాశ్రయాలకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశాయి. చందా కొచ్చర్‌తోపాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌లపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశాయని ఏజెన్సీలు నివేదించాయి. సిబీఐ విజ్ఞప్తి మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది.
దీపక్ కొచ్చర్ సోదరుడు, అవిస్టా అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ రాజీవ్ కొచ్చర్‌ను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. వ్యాపార లావాదేవీల కోసం సింగపూర్ వెళుతుండగా రాజీవ్ కొచ్చర్‌ను అదుపులోకి తీసుకున్నారని ఒక జాతీయ మీడియాలో కధనాలు వెలువడ్డాయి. వీడియోకాన్ సంస్థకు 2012లో ఐసీఐసీఐ బ్యాంకు 3250 కోట్ల రూపాయిల రుణాన్ని మంజూరు చేసి లబ్ధి పొందిన కేసులో ఈ లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది. ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దేశం విడిచి వెళ్లకుండా వారిపై నిషేధం విధించారు.
ఐసీఐసీఐ- వీడియోకాన్ లోన్ కేసులో ప్రాథమిక దర్యాప్తు నమోదు చేసిన సీబీఐ.. దీపక్, వేణుగోపాల్లను అనుమానితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్లు ఏజెన్సీలు తెలిపాయి. అయితే చందా కొచ్చర్‌పై ఎలాంటి ఆరోపణలు లేనందున ఆమెపై లుక్అవుట్ సర్క్యులర్‌ను జారీ చేయలేదని.. అయితే ఆమె విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇవ్వాలని సీబీఐ కోరినట్లు తెలుస్తోంది.