ఉత్తర ప్రదేశ్ ఇటీవలే అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా మారుస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని ప్రశంసిస్తూనే విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు మరో విషయాన్ని తెరమీదకు తీసుకొని వచ్చింది. ప్రభుత్వం ఫైజాబాద్ పేరును కూడా మార్చాలని తెలిపింది. ఫైజాబాద్ పేరును శ్రీ అయోధ్యగా మార్చాలని డిమాండ్ చేస్తోంది. వీహెచ్పీ ప్రతినిధి శరద్ శర్మ మాట్లాడుతూ.. యూపీ ప్రభుత్వం బానిసత్వపు సంకెళ్లు తెచ్చుకొని.. పరాయివ్యక్తుల పేర్లతో ప్రచారమవుతున్న జిల్లాల పేర్లను మార్చాలని భావించడం మంచి పరిణామమని తెలిపారు. ఈ క్రమంలో పలు జిల్లాల పేర్లను కూడా మార్చాలని ఆయన తెలిపారు. ఫైజాబాద్ పేరును శ్రీ అయోధ్యగా మారిస్తే తాము సంతోషిస్తామని ఆయన తెలిపారు.
అలాగే భారతదేశంలో అనేక వీధుల పేర్లు, బిల్డింగ్ పేర్లు, జిల్లాల పేర్లు మార్చాల్సిన అవసరం ఉందని శర్మ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా భారతదేశంలో పలువురు బానిసత్వపు మనస్తత్వాలను వదిలి స్వతంత్రంగా ఆలోచిస్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బ్రిటీషర్ల నుండి స్వాతంత్ర్యం పొందినా.. ఇంకా కొన్ని చోట్ల బ్రిటీష్ రాజులు, రాణుల పేర్లు పలు ఊర్లకు పెట్టబడ్డాయని.. అవి భారతీయుల ఆత్మగౌరవానికి మచ్చ అని.. వాటిని మార్చాలని ఆయన తెలిపారు.
తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అలహాబాద్ పేరును మార్చాలని భావించిన తరుణంలో.. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మాత్రం ఆయన వైఖరిని తప్పుపట్టారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఆదిత్యనాథ్ ఆలోచనను తప్పుబట్టారు. స్వాతంత్ర్య సమరంలో అలహాబాద్ ప్రధాన పాత్ర పోషించిందని.. అలాంటి ఊరి పేరును మార్చడం వల్ల అంతర్జాతీయ చరిత్రలో ఆ పేరు, ఆ పేరుతో పాటు పోరాటాలకు సంబంధించిన చరిత్ర కూడా మరుగున పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఇది బీజేపీ అవలంబిస్తున్న మరో ఎత్తుగడ అని తెలిపారు.