కొత్త పార్టీ ప్రకటించిన నటుడు ఉపేంద్ర

Last Updated : Nov 1, 2017, 11:18 AM IST
కొత్త పార్టీ ప్రకటించిన నటుడు ఉపేంద్ర

దక్షిణ భారతదేశంలో మరో సినిమా యాక్టర్ ఒక కొత్త పార్టీని స్థాపించారు. ఆయనెవరో కాదు.. అటు కన్నడ, ఇటు తెలుగు సినీరంగాలలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు, రియల్ స్టార్ ఉపేంద్ర. 'కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ(కేపీజేపీ)' పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు ఆయన. బెంగళూరులోని గాంధీభవన్‌లో మంగళవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో ఉపేంద్ర పార్టీ ప్రకటించారు. 'పబ్లిక్ డొమైన్'' వెబ్సైటులో ప్రసంగించారు కూడా. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - " ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అందుకే ఈ కొత్త పార్టీ. డ్రెస్‌కోడ్‌ను ఖాకీ యూనిఫాంగా నిర్ణయించాము. తమ పార్టీలో చేరాలనుకునే వారికి డబ్బు అవసరం లేదని, కేవలం కొత్త ఆలోచనలు, ప్రజల కోసం కష్టపడే తత్వం ఉంటే చాలు" అని అన్నారు. పార్టీ ప్రకటించిన కార్యక్రమంలో ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక ఉపేంద్ర ఖాకీ దుస్తులు ధరించడం గమనార్హం. 

వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 224 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ఉపేంద్ర పేర్కొన్నారు. ‘మీరు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు.. నా సిద్ధాంతాన్ని నమ్మండి. ఇతర పార్టీవాళ్లు డబ్బిస్తే తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మీదే కాబట్టి’ అని ఉపేంద్ర ఉద్వేగంగా ప్రసంగించారు. కర్ణాటకలో వచ్చే ఏడాది 2018లో ఎన్నికలు జరగనున్నాయి. 

Trending News