ప్రసూతి ప్రయోజనాలను పెంచుతూ.. వారి కెరీర్‌ను మరింత ప్రోత్సహించడానికి గత ఏడాది కేంద్రం తీసుకొచ్చిన ప్రసూతి చట్టం మహిళా ఉద్యోగులకు శాపంగా మారింది. ఇప్పటికే ఆడవారికి అంతంతమాత్రంగా ఉన్న ఉద్యోగావకాశాలు ఈ చట్టంతో సన్నగిల్లాయని ఓ నివేదిక తెలిపింది. ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచడంతో సంస్థ నడపడం కష్టమవుతుందని.. దీంతో మహిళలను నియమించుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపవని టీమ్‌లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ తన అధ్యయనంలో వెల్లడించింది.
ప్రసూతి ప్రయోజనాల ప్రభావం వ్యాపారం, ఉపాధి మీద పడుతుందని పేర్కొంది. 11 లక్షల నుంచి 18 లక్షల మంది మహిళలు ఈ ఆర్థిక సంవత్సరంలో (2018 ఏప్రిల్-2019 మార్చి) కొత్త ఉద్యోగాలను వెతుక్కోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపింది. ప్రస్తుత లెక్కల ప్రకారం.. భారతదేశంలో మొత్తం ఉద్యోగుల్లో 27 శాతం మహిళలు ఉన్నారు.
ఏవియేషన్, ఐటీ, ఐటీ సంబంధిత సర్వీసులు, రియల్ ఎస్టేట్, విద్యా, ఈ-కామర్స్, తయారీ, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసులు, రిటైల్, టూరిజం రంగాలలో ఉద్యోగులపై ఈ సర్వేను టీమ్‌లీజ్ సర్వీసెస్ నిర్వహించింది. ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబాల్లో మహిళలు బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేయడం లేదని.. భర్త వేతనం తగ్గితే, అప్పుడు ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.