మహారాష్ట్ర సర్కార్: బీజేపికి మూడేళ్లు.. శివ సేనకు రెండేళ్లు.. ?

మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటు విషయంలో మరో కీలక పరిణామం.. ముఖ్యమంత్రి పదవి పంపకం విషయంలో శివ సేనకు కీలక ప్రతిపాదన చేసిన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె

Last Updated : Nov 18, 2019, 06:03 PM IST
మహారాష్ట్ర సర్కార్: బీజేపికి మూడేళ్లు.. శివ సేనకు రెండేళ్లు.. ?

న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటు విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి పంపకం విషయంలో శివ సేనకు ఓ కీలక ప్రతిపాదన చేసినట్టు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. బీజేపికి మూడేళ్లు, శివసేనకు రెండేళ్లు చొప్పున ముఖ్యమంత్రి పదవిని పంచుకునే విధంగా రాష్ట్రంలో సర్కార్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాల్సిందిగా శివ సేన ఎంపీ సంజయ్ రావత్‌కి సూచించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఈ విషయంలో బీజేపికి అభ్యంతరం లేకపోతే.. తమకూ ఏ అభ్యంతరం లేదని సంజత్ రావత్ చెప్పినట్టుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇదే విషయమై తాను బీజేపి అధినాయకత్వంతో చర్చించనున్నట్టు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పష్టంచేశారు.

శివ సేనకు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన ప్రతిపాదనకు బీజేపి అంగీకరించినట్టయితే... మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు సమస్య ఓ కొలిక్కి వచ్చినట్టేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Trending News