కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్ కుమార్ (59) ఈ రోజు ఉదయం సుమారు 1.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు

Last Updated : Nov 12, 2018, 10:32 AM IST
కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్ కుమార్ కన్నుమూత

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్ కుమార్ (59) ఈ రోజు ఉదయం సుమారు 1.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన గతంలో ఇదే చికిత్స నిమిత్తం అమెరికాకి కూడా వెళ్లారు. లండన్, న్యూయార్క్ లాంటి చోట్ల చికిత్స చేయించుకున్న ఆయన.. భారత్ తిరిగి వచ్చాక కొన్నాళ్లు ఇంటిలోనే గడిపారు. తర్వాత మళ్లీ అత్యవసర అనారోగ్య కారణాల వల్ల బసవనగుడిలోని శ్రీ శంకర క్యాన్సర్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే కన్నుమూశారు.

జులై 22, 1959 తేదిన బెంగళూరులో జన్మించిన అనంత్ కుమార్.. 6 సార్లు ఉత్తర బెంగళూరు స్థానం నుండి ఎంపీగా గెలిచారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలందిస్తున్న అనంత్ కుమార్.. గతంలో ఎరువులు, రసాయనశాఖ మంత్రిగా కూడా సేవలందించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కూడా అనంత్ కుమార్ పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. 

అనంత్ కుమార్ మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయానని తెలిపారు. కర్ణాటక ప్రజలకు అనంత్ మరణం ఓ తీరని లోటు అని పేర్కొన్నారు. చాలా చిన్నవయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి.. ప్రజాసేవ చేసిన గొప్ప వ్యక్తి అనంత్ కుమార్ అని మోదీ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ కూడా అనంత్ కుమార్ మరణంపై విచారాన్ని వ్యక్తం చేశారు. మంచి సోదరుడిని కోల్పోయానని తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఓ ప్రకటనను విడుదల చేశారు. అనంత్ కుమార్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఉద్యోగరీత్యా న్యాయవాది అయిన అనంత్ కుమార్.. చాలా పిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయనకు ఓ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 

Trending News