కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసి) కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మధ్య చెలరేగిన అల్లర్లలో ప్రముఖ బెంగాలి రచయిత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం అవడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఇదే విషయాన్ని ఫిర్యాదు చేసేందుకు టీఎంసీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించుకున్నారు. డెరెక్ ఓబ్రియెన్, సుఖెండు శేఖర్ రే, మనీశ్ గుప్తా, నదీముల్ హఖ్ వంటి నేతల బృందం ఇసిని కలిసేందుకు అనుమతి కోరింది.
బీజేపి అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలోనే ఇరు పార్టీలకు చెందిన మద్దతుదారులు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. విద్యాసాగర్ కాలేజ్ వద్ద టీఎంసి విద్యార్థి విభాగం నేతలు నల్ల జండాలతో నిరసన తెలపడంతోపాటు బీజేపికి వ్యతిరేక ప్లకార్డులు, నినాదాలతో నిరసన తెలపడమే ఈ ఘర్షణకు కారణమైంది.