Telangana Elections 2023: ఈ దేశం, ఈ రాష్ట్రం, భవిష్యత్ మీ చేతుల్లో ఉంది: సీఎం కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ వాడి వేడి స్పీచ్ లతో అదరగొడుతున్నారు. ఈ రోజు జరిగిన హుజురాబాద్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ విశేషాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2023, 05:56 PM IST
Telangana Elections 2023: ఈ దేశం, ఈ రాష్ట్రం, భవిష్యత్ మీ చేతుల్లో ఉంది: సీఎం కేసీఆర్

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు తేదీ ఖారైరనప్పటి నుండి  వాడి వేడిగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. గులాబీ బాస్, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ యాక్టివ్ గా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ రోజు హూజూర్ నగర్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిచారు.

హూజూర్ నగర్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మంచి చెడు విచారించి ఎన్నికల్లో ఓటు వేస్తే నాయకులు కాదు ప్రజలే గెలుస్తురు. ప్రజలు గెలిచే ఎన్నికనే నిజమైన ప్రజాస్వామ్య ఎన్నిక.. ఎన్నిక యొక్క గెలుపు ప్రజల గెలుపు కావాలి.. నాయకులు కాదు.. నేను చెప్పే మాటలు మీమీ ఊరికెళ్లిన తర్వాత చర్చించి, ఆలోచించి ఏది నిజమో తెలిచిన తర్వాతనే ఓటు వేయండి. ఎన్నికల్లో నిలబడే వ్యక్తుల వెనుక పెద్ద పార్టీలు ఉంటయ్.. ఆయా పార్టీల చరిత్ర, వైఖరి, దృక్ఫథం, ఫిలాసఫీ ఏంటి?.. ఆయా పార్టీలు ఎవరి కోసం పనిచేస్తయో అని మీలో మీరే చర్చ జరపండి. దళిత బిడ్డలు యుగయుగాలుగా, తరతరాలుగా వివక్షకు, వెనుకబాటుతనానికి గురైతావున్నరు. దళితలు మనసాటి మానవులు కాదా..? ఎందుకీ దుస్థితి..? ఎందుకుండాలె ఈ ఖర్మ..?

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే కాంగ్రెస్ వాళ్లు ఆలోచన చేసివుంటే ఈరోజు దళిత సమాజం ఇన్ని బాధలు పడేది కాదు. ఎన్నికలు రాగానే గాయిగాయి గత్తర కావొద్దు.. మీరు సీరియస్ గా ఆలోచించాలి. గిరిజనులు ఎల్.హెచ్.పి.ఎస్. ఆధ్వర్యంలో ‘మా తాండాలో మా రాజ్యం’ అని యాభై ఏండ్లు కొట్లాడిండ్రు. ఎందరు ఎన్నో పార్టీలు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా చేయలేదు. ఎన్నికలలు వస్తే గోల్ మాల్ చేసి, గజకర్ణగోకర్ణ టక్కుటమార విద్యలు చెప్పి.. మందు సీసాలు సప్లై చేయడం కాదు ప్రజాస్వామ్యమంటే. యువత ఆలోచించాలి.

ఈ దేశం, ఈ రాష్ట్రం, భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. ఆషామాషీగా ఓటు వేయొద్దు. ఓటు మన తలరాతను, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న ఒకేఒక బ్రహ్మాండమైన ఆయుధం ఓటు. ఎన్నికల్లో నిల్చున్న నాయకుడే కాదు, ఆ నాయకుడి వెనుక పార్టీ ఏంటి..? దాని తత్వం ఏంటి..? వాళ్లు ఏం పని చేస్తరనేది గ్రామాలు, పట్టణాల్లో చర్చ జరగాలి. కండ్ల ముందు జరిగిన చరిత్రను కూడా నాయకులు వక్రీకరించి అబద్ధాలు చెబుతుంటారని కేసీఆర్ మాట్లాడారు. 

నాగార్జున సాగర్ ను ఏలేశ్వరం దగ్గర కట్టాలి. దాన్ని టక్కుటమారాలు చేసి ముందుకు తెచ్చి కడితే ఆనాడు నోరు మూసుకున్నది ఎవరో కాదు తెలంగాణ కాంగ్రెస్ నాయకులే. 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలుపాలె అని ప్రతిపాదన వస్తే.. ఇక్కడి విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలందరూ వ్యతిరేకించారు. తెలంగాణను ఆంధ్రలో కలుపొద్దని ఆనాడు హైదరాబాద్ సిటీ కాలేజీలో ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ అని ఉద్యమం జరిగితే పోలీస్ ఫైరింగ్ లో 7గురు విద్యార్థులు చనిపోయారు., ఆనాడు నోరుమూసుకొని ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపిన పాపాత్ములే ఆనాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. నాగార్జున సాగర్ కట్టవల్సిన దగ్గర కడితే మూసీ దాటాక చాలా దూరం వరకు కూడా నీళ్లు వచ్చేవి. మనకు రాకుండా ఘోరం చేసారు. హుజూర్ నగర్ లో టెయిల్ ఎండ్ మండలాల గతి ఏమి ఉండె? నానాయకట్ రైతుల గతి ఏముండె? దయచేసి ఆలోచన చేయాలి.  మంచి పాదముంటే వర్షాలు పడుతయంటరు. తెలంగాణ ఏర్పడ్డాక వర్షాలు బాగా కురిసాయి. తొమ్మిదేండ్లలో నాగార్జున సాగర్ నుండి 18 సార్లు నీళ్లు విడిచిపెట్టాం. రెండో పంట కూడా పండించుకున్నం. గతంలో పాలకీడు, మఠంపల్లి, మేళ్ల చెరువు మండలాల్లో టెయిల్ ఎండ్ కు నీళ్లు రాక, కరెంటు మోటార్లు పెట్టి, ఆ కరెంటు సక్కగ రాక కాల్వల మీద రైతులు పండుకున్నరు. ఇది నిజమా..? కాదా..? టెయిల్ ఎండ్ లలో నీళ్లు రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎన్నడు కూడా కొట్లాడలేదు. మాకు కరెంటు ఎందుకియ్యరని కాంగ్రెస్ నాయకులు అడగలే..కొట్లాడలేదు. కాంగ్రెసోళ్లకు మంత్రి పదవులు వస్తే చాలు.. ప్రజలెటైనా పోనీ కానీ అదే స్వర్గం అనుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఎమ్మెల్యేలు పేగులు తెగేదాక కొట్లాడిండ్రు. ఆంధ్రా ముఖ్యమంత్రి ఎవరున్నా వాళ్లని నిలదీసిండ్రు. 2003లో లెఫ్ట్ కాలువ కింద పంటలు వేసుకోమన్నరు..కానీ నీళ్లు ఇయ్యలేదు. నాడు రైతులతో కలిసి వచ్చి 24 గంటల్లో నీళ్లు ఇయ్యకుంటే 5 లక్షల మందితో వచ్చి తూము విడుస్తా.. జాగ్రత అని చెప్పిన. తెల్లారేవరకు నీళ్లు విడిచిపెట్టిండ్రు. గులాబీ జెండా ఎగురాక ఒక్క టీఆర్ఎస్ నాయకులే కొట్లాడిండ్రు తప్ప ఆనాటి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎందుకు కొట్లాడలేదు..? ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు పోలేదు? నీళ్లిస్తవా లేదా అని రాజీనామా చేస్తే నీళ్లు విడుకపోవునా. కాంగ్రెస్ నాయకులు పదవులు, కాంట్రాక్టులు, పైరవీలే ముఖ్యమనుకున్నరు గానీ నీళ్లు అడగలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్పప్పుడే నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వను..ఏం చేసుకుంటరో చేసుకోండన్నడు. ముఖ్యమంత్రి అట్లెట్ల మాట్లాడుతవని కాంగ్రెస్ లో అడిగే మొగోడు కూడా లేకుండెనా? తెలంగాణ బిడ్డలమైన మా ముందే అంటావా అని రాజీనామా చేసి కిరణ్ కుమార్ రెడ్డి ముఖం మీదనే కొట్టాల్సి ఉండె. ఎక్కడికి బాయె పౌరుషం.. 

కాంగ్రెసోళ్లకు హుజూర్ నగర్, నాగార్జున సాగర్, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలె కానీ తెలంగాణ ప్రజల బాధలు మాత్రం అవసరం లేదు. 1956 లో కాంగ్రెస్ చేసిన చిన్న పొరపాటు వల్ల తెలంగాణ ప్రజలు 58 ఏండ్లు ఏడ్చిండ్రు. కరెంటు లేదు..మంచినీళ్లు లేవు..కాలువల నీళ్లు రావు..అయితయన్న ప్రాజెక్టులు రావు.. ఉద్యోగాలు పోయినయ్..నిధులు పోయినయ్.. అన్నీ పోయి గొడగొడ ఏడ్చినం.1969లో వందలాది మందిని కాల్చేసిండ్రు ఇదే కాంగ్రెసోళ్లు. తెలంగాణ ఇస్తమని కాంగ్రెస్ 2004లో మనతో పొత్తు పెట్టుకొని గడ్డకెక్కిండ్రు.. తీర్థం పోదాం తిమ్మక్కా అంటే..నువ్వు గుల్లె..నేను సలిలె.. అని కాంగ్రెసోళ్లు మంత్రి పదవులు పంచుకొని తెలంగాణ వదిలిపెట్టిండ్రు.

14 ఏండ్లు కొట్లాడిన తర్వాత ‘కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో’ అని ఆమరణ దీక్షకు కూర్చుంటే ఇక ఇవ్వక తప్పదని తెలంగాణ కోసం దిగొచ్చిండ్రు. ఒక్క తెలంగాణ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు. రాజీనామా చేయమంటే లాగులు తడుపుకుంటూ గజగజ వణుక్కుంటూ పోయిండ్రు. చివరికి ఎన్నో బాధలు పడి మనం తెచ్చినం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. కాంగ్రెస్సే గెలిచే పరిస్థితి లేదంటే.. నేను ముఖ్యమంత్రి అయితా అంటే నేను అయితా అని అంటున్నరు. తెలంగాణ కాంగ్రెస్ లో ఒక డజన్ మంది ముఖ్యమంత్రులున్నరు. కరెంటు రాక, మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి రైతులు గొడగొడ ఏడ్చిననాడు ఏ కాంగ్రెస్ నాయకుడూ పట్టించుకోలేదు. నాడు మంచినీళ్లు లేక అనేక ఇబ్బందులు పడి ఘోరాతిఘోర పరిస్థితులుంటే అడినవారు లేరు. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ బాధను తప్పించుకొని మంచినీళ్ల కరువు పోగొట్టుకున్నం. పంటలు ఎండిపోకుండా గతంలో నీళ్లు ఇచ్చినం..ఇప్పుడు కూడా తప్పకుండా ఇస్తం. నాడు రైతులకు బకాయీలుంటే కోఆపరేటివ్ బ్యాంకోల్లు తలుపులు, దర్వాజాలు తీసుకపోయారు కానీ రైతులకు సాయం చేయలేదు. ఈ ప్రపంచంలో రైతు బంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్. తెలంగాణ వచ్చిన రోజున అనేక బాధలతో ఉన్నం.  ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, ఐక్యరాజ్య సమితి లు కూడా రైతుబంధు మంచి పథకమని నన్ను మెచ్చుకున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రైతు బంధు మంచిది కాదంటున్నడు. ప్రజలు కట్టే ట్యాక్స్ ను దుబారా చేస్తున్న అంటున్నారు.  

Also Read: PM Kisan Scheme: రైతులకు దీపావళి కానుక.. త్వరలోనే పీఎం కిసాన్ నిధులు జమ  

అశోక్ గులాటి అనే శాస్త్రవేత్త రైతులకు డబ్బు ఇస్తే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కిరాయిలు ఏదైనా కొంటాడని సూచించాడు. కేసీఆర్ కలను నిజం చేసిన మొనగాళ్లు నా తెలంగాణ రైతులు. మూడు కోట్ల టన్నులు పంట ఉత్పత్తితో పంజాబ్ తర్వాత తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. అన్ని లిఫ్ట్ లు పూర్తయితే దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ నిలుస్తది. రైతుబందు వద్దన్న నాయకుడు కావాల్నా? రైతుబంధు కావాలంటున్న సైది రెడ్డి కావాల్నా..? రైతు బంధు దుర్వినియోగం చేస్తున్నానని మరో కాంగ్రెస్ నాయకుడు మూడు గంటలు కరెంటు చాలంటడు. రాహూల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు, భట్టి విక్రమార్క ధరణి తీసేయాలంటడు..ఆయనకేమైన వ్యవసాయం గురించి తెలుసా..?  ధరణి వల్లను రైతుబంధు, రైతు బీమా, పంటల పైసలు మీకు డైరెక్ట్ గా వస్తున్నయ్. ధరణి లేకుంటే రైతులు దళారుల పాలవుతారు. ధరణి వల్లనే రిజిస్ట్రేషన్లు సులభమయ్యాయి. భూముల మీద అధికారాన్ని ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలకే ఇచ్చినాం. పేదలకు కళ్యాణలక్ష్మి యాభై వేల నుంచి పెంచుకుంటూ లక్షా పెన్షన్ పెంచుకుంటూ ఐదు వేలకు పెంచుతాం. రేషన్ కార్డు ఉన్నోళ్లందరికీ సన్నబియ్యం పెడుతాం. బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మొదలు పెట్టాం. పేదలకూ కంటి వెలుగు ను చేపట్టినం. గ్యాస్ సిలిండర్ ను తక్కువ రేటుకే ఇస్తాం. మహిళలకు రూ.3 వేలు ఇస్తాం. శపథాలు కావు..ప్రజలకు వసతులు కావాలి. లిఫ్ట్ పనులు, లైనింగ్, ఇండస్ట్రియల్ పార్క్ లాంటి అభివృద్ధి పనులనూ తప్పక చేపడుతాం. సైదిరెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించండి..హుజూర్ నగర్ కు కావాల్సినవన్నీ నేను మంజూరు చేస్తాను. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను.

Also Read: iPhone Tapping: దేశంలో ఫోన్ ట్యాపింగ్ దుమారం, ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News