తాజ్‌మహల్ పై ముగిసిందనుకున్న వివాదం మళ్లీ మొదటికే వచ్చింది. బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ సోమవారం తాజ్‌మహల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ త్వరలో తేజ్ మందిర్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆగ్రాలో 'తాజ్ మహోత్సవ్' గురించి ప్రశ్నించగా, ఎంపీ పైవిధంగా బదులిచ్చారు. 'తాజ్ మహోత్సవ్, తేజ్ మహోత్సవ్ రెండూ ఒకటే. తాజ్, తేజ్ మధ్య పెద్ద తేడా లేదు. తేజ్ మందిర్‌ను ఔరంగజేబు శ్మశాన వాటికగా మార్చాడు. తాజ్ మహల్ త్వరలోనే తేజ్ మందిర్‌గా మార్చబడుతుంది' అని ఆయన అన్నారు.
"ఉత్సవం నిర్వహించడం ఆనందించదగ్గ విషయమే. కానీ, ఈ తాజ్‌మహల్ ఔరంగజేబ్ సమయంలో ఉనికిలో లేదు. ఇది మా ఆలయం" అన్నారాయన.
గతంలో కూడా, తాజ్‌మహల్ నిజానికి 'శివాలయం' అని కతియార్ అన్నారు. "ఇది (తాజ్‌మహల్) ఒకప్పుడు శివాలయం. అందులో 'శివలింగం' కూడా నిర్మించబడింది. దీనిని తరువాత తొలగించారు. మొఘల్ సమాధి ఒక హిందూ దేవాలయం అని చెప్పడానికి అక్కడ అనేక గుర్తులు ఉన్నాయి" అని చెప్పారు.
ఫిబ్రవరి 18 నుండి ఆగ్రాలో 10 రోజుల పాటు తాజ్ మహోత్సవ్‌ను నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ రామ్‌నాయక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన అతిథులుగా హాజరుకానున్నారు.