కర్ణాటకలో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ కూటమి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగుతున్న సందర్భంగా కర్ణాటక పాలిటిక్స్‌పై ఓ వాట్సాప్ జోక్ ప్రస్తావనకు రావడంతో కాసేపు కోర్టులో నవ్వులు విరబూశాయి. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన మెజార్టీ భారతీయ జనతా పార్టీకి వుందని ఆ పార్టీ తరపున కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ కోర్టుకు తెలిపారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీనే రిసార్ట్‌లో బంధించి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది అంటూ రోహ్తగీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో ముకుల్ రోహ్తగీ చేసిన వ్యాఖ్యలపై ఈ వాదనలు వింటున్న సుప్రీం కోర్టు జడ్జి అర్జన్ కుమార్ సిక్రీ స్పందిస్తూ.. '''అవును, నేను కూడా వాట్సాప్‌లో ఓ జోక్ చదివాను. ఏ రిసార్ట్లోనైతే 116 మంది ఎమ్మెల్యేలు వున్నారో.. ఆ రిసార్ట్ యజమాని కూడా 116 మంది ఎమ్మెల్యేలు తనతోనే వున్నారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తనకు ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ని కోరినట్టుగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఓ జోక్‌ని తాను కూడా చదివాను'' అని ఏకే సిక్రీ అన్నారు. ఏకే సిక్రీ సరదాగా ప్రస్తావించిన వాట్సాప్ జోక్ విని నవ్వుకోవడం అక్కడున్న వాళ్ల వంతయ్యింది.
కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా బీజేపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని, ఆ ఆదేశాలను నిలిపేయాలని విజ్ఞప్తి చేస్తూ జేడీఎస్-కాంగ్రెస్ కూటమి దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక సర్కార్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి మెజార్టీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వం వహించిన ఈ త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ ఎస్.ఏ. బాబ్డే, జస్టిస్ అశోక్ భూషన్ సభ్యులుగా వున్నారు.