దక్షిణ కొరియా Vs తెలంగాణ : నేటి నుంచి ఐదు రోజులపాటు బిగ్ ఫైట్

దక్షిణ కొరియా Vs తెలంగాణ

Last Updated : Jun 14, 2018, 01:56 PM IST
దక్షిణ కొరియా Vs తెలంగాణ : నేటి నుంచి ఐదు రోజులపాటు బిగ్ ఫైట్

దక్షిణ కొరియా వంటి దేశంతో భారత్‌లో ఒక రాష్ట్రమైన తెలంగాణ నేరుగా తలపడటం ఏంటని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఇది దక్షిణ కొరియా-తెలంగాణ మధ్య జరగనున్న స్నేహపూర్వకమైన పోటీలు మాత్రమే. ఇండోనేసియా రాజధాని జకార్తా వేదికగా ఆగస్టు–సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలను ఎదుర్కునేందుకు దక్షిణ కొరియా, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్ల మధ్య నేటి నుంచి స్నేహపూర్వక కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత కబడ్డీ సమాఖ్య, తెలంగాణ కబడ్డీ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి బాచుపల్లిలోని కబడ్డీ అకాడమీ క్రీడా వేదికగా నిలవనుంది. పురుషులు, మహిళల విభాగంలో 19వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నట్టు నిర్వాహకులు స్పష్టంచేశారు. నేటి సాయంత్రం 5 గంటలకు జరుగనున్న ఈ టోర్నీని ఎమ్మెల్యే జి. కిషన్‌ రెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య సాంకేతిక డైరెక్టర్‌ ఇ. ప్రసాద్‌ రావు, శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రతీ రోజు సాయంత్రం వేళల్లో ఈ కబడ్డీ మ్యాచ్‌లు జరగనున్నాయి. 

ఇదిలావుంటే, త్వరలోనే దుబాయ్‌లో జరగనున్న కబడ్డీ మాస్టర్స్ కప్ కోసం భారత జట్టుని సిద్ధం చేసేందుకు తెలంగాణకు చెందిన అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు ఎల్ శ్రీనివాస్ రెడ్డిని భారత జట్టు కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

Trending News