న్యూ ఢిల్లీ : కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus ) నివారణకు కేంద్రం లాక్ డౌన్ ( Lockdown ) విధించిన నేపథ్యంలో దేశం నలుమూలలా చిక్కుకుపోయిన వలసకూలీలను ( Migrant workers ) తరలించేందుకు కేంద్రం శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ( Shramik special trains ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మే 1 నుంచి 2,317 శ్రామిక్ రైళ్లలో వలసకూలీలు, ఇతరులు కలిపి 31 లక్షల మందికిపైగా రైలు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చినట్టు ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఇండియన్ రైల్వేస్ అంచనా వేసినదానికంటే ఇది 7 లక్షలు ఎక్కువ. అయితే, ఇదే తరహాలో మే 21 నాడు ముంబై నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కి బయల్దేరిన వలసకూలీలు, ఇతర రైలు ప్రయాణికులకు మాత్రం ఇండియన్ రైల్వే ఊహించని షాక్ ఇచ్చింది.
ముంబై నుంచి గోరఖ్ పూర్ బయల్దేరిన రైలు నేరుగా గమ్యస్థానానికి చేరుకోకుండా ఒడిషాలోని రూర్కెలాకు చేరుకుంది. రైలు రూర్కెలా చేరుకోవడానికంటే ముందుగా.. ముంబై నుంచి బయల్దేరిన 23 గంటల తర్వాత కూడా తమ రైలు మహారాష్ట్రలోనే ఇంకా ఎందుకు తిరుగుతుందో అర్థం కాని రైలు ప్రయాణికులు.. అప్పటికే ఎవరిని అడగలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఇంకొంతమంది తమ రైలు భుసావల్ నుంచి నాగపూర్ వైపు ఎందుకు వెళ్తుందంటూ ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. 24 గంటల రైలు ప్రయాణంలో తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక తిప్పలు పడుతోంటే.. ఇప్పుడిలా తమ రైలు చేరుకోవాల్సిన చోటుకు కాకుండా ఇంకెక్కడికో చేరుకుంటే ఎలా అని తలలు పట్టుకున్నారు.
లోకోపైలట్ దారి మర్చిపోవడం వల్లే గోరఖ్‌పూర్ వెళ్లాల్సిన రైలు రూర్కెలాకు వచ్చిందంటూ రైలు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే, ఈ ఘటనపై స్పందించిన ఇండియన్ రైల్వే మాత్రం కొన్ని రైలు మార్గాల్లో రద్దీ ఉన్నందున రైళ్లను మరో ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తున్నామని.. అందులో భాగంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని అభిప్రాయపడింది. ఇండియన్ రైల్వే చరిత్రలో ఇలా రైలు ప్రయాణికులకు తెలియకుండా ఒక చోటికి వెళ్లాల్సిన రైలు మరో చోటికి వెళ్లడం జరిగిందని రైల్వే శాఖ వెల్లడించింది. రూర్కెలా నుంచి ఆద్రా, అసన్‌సోల్ మీదుగా రైలు గోరఖ్‌పూర్‌కి మళ్లించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.