మహారాష్ట్ర రాజకీయాలపై పెదవి విప్పిన అమిత్ షా

మహారాష్ట్ర రాజకీయాలపై పెదవి విప్పిన అమిత్ షా

Last Updated : Nov 13, 2019, 08:25 PM IST
మహారాష్ట్ర రాజకీయాలపై పెదవి విప్పిన అమిత్ షా

న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితిపై ఎట్టకేలకు బీజేపి చీఫ్ అమిత్ షా పెదవి విప్పారు. శివసేన చేస్తోన్న డిమాండ్స్ పట్ల తాము సంతృప్తికరంగా లేమని.. అవి అంగీకారయోగ్యమైనవి కావని అమిత్ షా స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరగడాని కంటే ముందుగానే ప్రధాని మోదీ, తాను ఇద్దరం ఈ విషయంలో ఓ స్పష్టమైన ప్రకటన చేశామని.. తమ కూటమి గెలిస్తే, దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించినప్పుడు అభ్యంతరాలు చెప్పని శివసేన ఇప్పుడు కొత్త కొత్త డిమాండ్లు వినిపిస్తోందని అమిత్ షా మండిపడ్డారు. 

శివ సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడాన్ని ఈ సందర్భంగా అమిత్ షా తీవ్రంగా తప్పుపట్టారు. ''ఇదివరకు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా 18 రోజుల సమయం ఇచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం పదవీ కాలం ముగిసిన తర్వాతే గవర్నర్ పార్టీలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. ఏ పార్టీ కూడా సరైన మద్దతుతో గవర్నర్ వద్దకు వెళ్లని పక్షంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అలా కాకుండా ఇప్పటికీ తమకు మద్దతు ఉందని ఏ పార్టీ అయినా భావిస్తే.. వారు ఈరోజే వెళ్లి గవర్నర్‌ని కలవొచ్చు'' అని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు హితవు పలికారు.

Trending News