Parkash Singh Badal's Death News: ప్రకాశ్ సింగ్ బాదల్ ఇక లేరు.. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నేత

Parkash Singh Badal's Death News: 1995 నుంచి 2008 వరకు శిరోమణి అకాలి దళ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన ప్రకాశ్ సింగ్ బాదల్.. 1970 నుంచి 2017 మధ్య కాలంలో ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.

Written by - Pavan | Last Updated : Apr 25, 2023, 10:30 PM IST
Parkash Singh Badal's Death News: ప్రకాశ్ సింగ్ బాదల్ ఇక లేరు.. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నేత

Parkash Singh Badal's Death News: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ ఇక లేరు. కొద్దిసేపటి క్రితమే ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రకాశ్ సింగ్ బాదల్‌ని కుటుంబసభ్యులు ఏప్రిల్ 21న మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వైద్యులు ఆయన్ను ఐసీయులోనే ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ఐసీయూలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించినప్పటికీ.. మంగళవారం సాయంత్రం అనారోగ్యం మరింత విషమించడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రకాశ్ సింగ్ బాదల్ తుది శ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు పీటీఐకి తెలిపాయి. ప్రస్తుతం ప్రకాశ్ సింగ్ బాదల్ వయస్సు 95 ఏళ్లు. తన జీవితం మొత్తం ప్రజా జీవితం మొత్తం ప్రజా సేవకే అంకితం చేసిన అతి కొద్దిమంది ప్రజా నేతల్లో ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా ఒకరు.

ప్రకాశ్ సింగ్ బాదల్ 1970 నుంచి 2017 మధ్య కాలంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఐదుసార్లు రాష్ట్రానికి సేవలు అందించారు. 1970 నుంచి 71, 1977 నుంచి 1980, 1997 నుంచి 2002 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తరువాత 2007 నుంచి 2017 వరకు వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా గెలిచి రాష్ట్రానికి సేవలు అందించారు.  

1995 నుంచి 2008 వరకు ప్రకాశ్ సింగ్ బాదల్ శిరోమణి అకాలి దళ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకాశ్ సింగ్ బాదల్ అందించిన సేవలకుగాను 2015 లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించి గౌరవించింది. 

ప్రకాశ్ సింగ్ బాదల్ ఇక లేరనే దుర్వార్త తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారత రాజకీయాల్లోనే ప్రకాశ్ సింగ్ బాదల్ శిఖరం అంతటి మహోన్నత వ్యక్తి అని.. దేశానికి, పంజాబ్ రాష్ట్రాభివృద్ధికి ప్రకాశ్ సింగ్ బాదల్ ఎంతో కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ముఖ్యంగా పంజాబ్ అభివృద్ధి కోసం ప్రకాశ్ సింగ్ బాదల్ అవిశ్రాంత కృషిచేశారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు.

Trending News