బహ్రైచ్, యూపీ: యుపీ విద్యాశాఖ మంత్రి అనుపమ జైస్వాల్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులను ఆకలితో ఉంచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అధికారులు. మంత్రి జైశ్వాల్ బహ్రైచ్‌లోని ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా.. విద్యార్థులు ఆ కార్యక్రమానికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లి కూర్చున్నారు.
అయితే మంత్రి అనుపమ జైస్వాల్ రాత్రి 8 గంటలకు కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇదే విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించగా 'పిల్లలు ఎనిమిది గంటలు ఎందుకు కూర్చున్నారనేది నాకూ తెలియదు. సంబంధిత ఉపాధ్యాయులు జవాబు చెప్పాల్సి ఉంది' అని మంత్రి బదులిచ్చారు. కాగా మంత్రి తీరుపై ఆ పిల్లల తల్లితండ్రులు మండిపడ్డారు. 'మంత్రి 12 గంటలకు రావాల్సి ఉండగా.. రాత్రి 8 గంటలకు వచ్చారు. పిల్లలు అంతసేపు కూర్చున్నా వారికి తినడానికి ఏమీ కూడా ఇవ్వలేదు' అని వారు ఆరోపించారు.
Bahraich: School children allegedly kept hungry at an event attended by State Minister, Anupama Jaiswal. Students were allegedly seated at 12 pm while event began at 8 pm. Minister says, 'I don't know why children were seated 8 hours in advance, concerned teachers are answerable' pic.twitter.com/PTmnLIoCu5
— ANI UP (@ANINewsUP) May 5, 2018
అంతకు ముందు అనుపమ జైశ్వాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. దళితుల ఇండ్లకు వెళ్లినప్పుడు తమను దోమలు కుడుతున్నా భరిస్తున్నామని వ్యాఖ్యానించారు. దళితులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని.. కానీ వారి నివాసాల్లో దోమలు కుడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దోమలు కుట్టినా.. భరిస్తూనే వారి ఇండ్లలో పర్యటిస్తున్నామని చెప్పారు. తాము చేస్తున్న పనిలో తమకు సంతృప్తి ఉందన్నారు.
మరో మంత్రి సురేశ్ రానా ఇటీవలే దళితుల ఇంటికి భోజనానికి వెళ్లి.. బయటి భోజనం తెప్పించుకొని తిన్నారని దళిత సంఘాలు మండిపడ్డాయి. ఇక రాజేంద్ర ప్రతాప్ సింగ్ అనే మరో మంత్రి అయితే ఆ రాముడు శబరి ఇచ్చిన రేగుపళ్లను తిని ఆమెను ఆశీర్వదించినట్లే.. బీజేపీ నేతలు దళితుల ఇళ్లకు వెళ్లి వాళ్లను ఆశీర్వదిస్తున్నారని వ్యాఖ్యానించారు.