భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్ లోక్ సభ స్థానం నుంచి తమ పార్టీ తరపున సాధ్వీ ప్రగ్యా సింగ్ థాకూర్‌ను అభ్యర్థిగా బరిలో నిలుపుతున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రకటన వెలువడిన వెంటనే మీడియాతో మాట్లాడిన సాధ్వీ ప్రగ్యా సింగ్.. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఇప్పటికే తాను తన ఏర్పాట్లలో సిద్ధమైనట్టు తెలిపారు. ఎన్నికల సమరం కోసం తాను సిద్ధమైనట్టు ప్రకటించిన సాధ్వీ ప్రగ్యా సింగ్.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తనకు ఏ మాత్రం పోటీకాబోరని భావిస్తున్నట్టు చెప్పారు. జాతికి వ్యతిరేకంగా మాట్లాడే దిగ్విజయ్ సింగ్.. జాతీయవాదినైన తనకు ఏ విధంగానూ పోటీ ఇవ్వలేరనేది తన అభిప్రాయంగా సాధ్వీ పేర్కొన్నారు.
16 ఏళ్లప్పటి నుంచే తాను భోపాల్ లో ఉంటున్న స్థానికురాలినని, భోపాల్ లో తనకున్న అనుబంధం తనకు ఓ ప్లస్ పాయింట్ అని చెప్పుకొచ్చిన సాధ్వీ తన గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు. భోపాల్ నుంచి సాధ్వీ పేరుతో పాటు గుణ లోక్ సభ నుంచి కేపి యాదవ్, సాగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి రాజ్ బహదూర్ సింగ్, విదిశ లోక్ సభ స్థానం నుంచి రమాకాంత్ భార్గవ్ పేర్లను బీజేపి అభ్యర్థులుగా ఆ పార్టీ బుధవారం విడుదల చేసిన జాబితాలో పేర్కొంది.