దేశీయ స్టాక్ మార్కెట్లకు టర్కీ భయం ఇంకా వదల్లేదు. గురువారం దేశీయ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం ఆరంభ ట్రేడింగ్ లోనే 150 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ కొద్దిసేపటికి క్రితం.. 165 పాయింట్లు క్షీణించి 37,686 వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 42 పాయింట్ల పతనంతో 11,392 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ రెండ్రోజుల క్రితపు కనిష్ట విలువ 70.08 కంటే మరింత పతనమై.. ఇవాళ ఉదయం 9:12కు రూ.70.32గా కొత్త జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసింది. తర్వాత కాస్త కోలుకొని రూ.70.17కు చేరుకుంది.
గెయిల్, సిప్లా, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం తదితర కంపెనీల షేర్లు లాభపడుతున్నాయి. వేదాంత, కొటక్ మహీంద్రా, హిందాల్కో, విప్రో, యస్ బ్యాంకు తదితర కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి పతనాన్ని అడ్డుకుంటాం: జైట్లీ
చరిత్రలో తొలిసారిగా డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కరెన్సీ మార్కెట్‌లో ఎలాంటి అస్థిరత ఎదురైనా ఎదుర్కొనేందుకు దేశంలో సరిపోయే విదేశీ మారక నిల్వలున్నాయన్నారు. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, రూపాయి పతనాన్ని అడ్డుకుంటామని అన్నారు.